IndiGo: ఇండిగో విమానంపై వడగళ్ళ వాన ! తీవ్రంగా దెబ్బతిన్న విమానం ముందుభాగం !

ఇండిగో విమానంపై వడగళ్ళ వాన ! తీవ్రంగా దెబ్బతిన్న విమానం ముందుభాగం !

IndiGo : ఇండిగో విమానం వడగండ్ల వానలో చిక్కుకుంది. విమానం ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా భారీ వడగండ్లు వాన కురిసింది. దీనితో విమానం ముందుభాగం దెబ్బతింది. విమానం ముందుభాగం దెబ్బతినడంతో క్యాబిన్‌ లో ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్(Sri Nagar) విమానాశ్రయంలో సాయంత్రం 6:30 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే దీనికి ముందు ఫ్లైట్ కుదుపులకు లోను కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళన చెందారు. అందులో ఉన్న 227 మంది ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

IndiGo flight damged due to rain

ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణించిన ఇండిగో(IndiGo) విమానం 6E2142 ఘోర ప్రమాదం నుంచి కొంచెంలో తప్పించుకుంది. 227 మంది ప్రయాణికులతో గమ్యస్థానం వైపు వెళ్లిన ఈ విమానం, హఠాత్తుగా వడగండ్ల తుఫానులో చిక్కుకుంది. ఆ క్రమంలో విమానం ముందు భాగంలో తీవ్రంగా దెబ్బతింది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీనితో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ’బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సాగరిక ఘోష్‌ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు. విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్‌, పాక్‌ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్‌ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.

Also Read : Governor Manoj Sinha : జమ్మూ కాశ్మీర్ బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Leave A Reply

Your Email Id will not be published!