Indigo: కర్నూలు- విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
కర్నూలు- విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం
Indigo : కర్నూలు- విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు దిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు. వారానికి మూడు రోజులపాటు కర్నూలు- విజయవాడ మధ్య సర్వీసులను ఇండిగో సంస్థ (Indigo) నడపనుంది.
Indigo Flights from Vijayawada to Kurnool
ఈ సందర్భంగా పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయాల అభివృద్ధికి దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు ఆయన పట్టుదలతో ముందుకెళ్తున్నారని చెప్పారు. కర్నూలు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఎప్పటికప్పుడు తమకు సలహాలు ఇస్తున్నారని చెప్పారు. కర్నూలు-విజయవాడ విమాన సర్వీస్ ప్రారంభించడం ఆనందాన్ని ఇస్తోందని రామ్మోహన్‌నాయుడు చెప్పారు. దీంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. భోగాపురం, నెల్లూరు, అనంతపురం, కుప్పం.. ఇలా అనేక ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కర్నూలు నుంచి ప్రస్తుతం వారంలో మూడు రోజులు నడిచేలా విమాన సర్వీసులను ప్రారంభించామని… అతి త్వరలో ప్రతి రోజూ నడిపేందుకు చర్యలు తీసుకుంటామని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విమాన సర్వీసుల ప్రారంభం సందర్భంగా విమానాశ్రయం వద్ద మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు తదితరులు ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.బి.నవ్య, కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ విద్యాసాగర్, ఇండిగో సంస్థ అధికారులు జిబు జాన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Siddharth Kaushal: ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా ! ఎందుకంటే ?
