Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం
పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటు పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు, సరబ్జిత్ సింగ్ భక్షి, రాకేశ్, అశ్వనీకుమార్ వర్మ, గౌరవ్ తివారీ, హేమంత్ గౌతమ్, సీఎస్‌ఎంఆర్‌ఎస్ అధికారులు మనీష్ గుప్తా, లలిత్ కుమార్ సోలంకి పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. ప్రాజెక్టు సీఈ కె.నరసింహమూర్తి, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు పనుల పురోగతిని వారికి వివరించారు. నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రం వాల్ పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ పటిష్ఠతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నిపుణుల బృందం తగు సూచనలు, సలహాలను జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది.
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. సోమవారం నాటి త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరు కాలేమని అందులో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణులు వస్తున్నారని అందులో వివరించింది. ఈ నెల 10 తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని ఏపీ ఈఎన్‌సీ కోరారు. ఇకపై కృష్ణా బోర్డు సమావేశాలు విజయవాడలోనే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.