ISIS: హైదరాబాద్ పేలుళ్ళకు విజయనగరంలో కుట్ర ! అడవిలో బాంబు ట్రయల్స్ !
హైదరాబాద్ పేలుళ్ళకు విజయనగరంలో కుట్ర ! అడవిలో బాంబు ట్రయల్స్ !
హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ ను ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ తో పాటు హైదరాబాద్ కు చెందిన సమీర్ అనే యువకుడ్ని కూడా అరెస్ట్ చేసి… విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉగ్రకుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సౌది నుంచి వచ్చే ఆదేశాలను సిరాజ్, సమీర్ అమలు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు, పోలీసులు గుర్తించారు. రంపచోడవరం అటవీ ప్రాంతంలో బాంబు పనితీరుపై సిరాజ్ రిహార్సల్ చేసినట్లు తేల్చారు. గత ఆరు నెలల్లో సిరాజ్ మూడు సార్లు సౌదీ వెళ్ళినట్టు పోలీసులకు గుర్తించారు. టిఫిన్ బాక్స్ బాంబ్‌లు తయారు చేయాలని సిరాజ్, సమీర్‌కు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూపు క్రియేట్ చేసుకున్నారని .. సిరాజ్, సమీర్‌తో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్లు తేలింది.
హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఆరుగురు గ్యాంగ్ కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని ఇద్దరికీ ఆదేశాలు రాగా… మిగతా నలుగురికి బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలు వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. హైదరాబాద్, విజయనగరంలో ఉగ్రకుట్రకు తెరలేపిన ఘటనలో ఓ వైపు ఎన్‌ఐఏ, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిన్న ఇద్దరు వ్యక్తులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సమీర్‌లను అరెస్ట్ చేసిన తర్వాత… వారి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించారు. కొంత కాలంగా ఇన్ట్సాగ్రామ్‌లో ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసి ఆరు మంది ఆ గ్రూప్‌లో ఉన్నారని, వీరికి సౌదీ అరేబియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని వారిచ్చే ఆదేశాలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సౌదీ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడమే వీరి పాత్ర అని పోలీసుల విచారణలో తేలింది.
విజయనగరం వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు.. అక్కడి పోలీసుల నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దనీ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈరోజు సోమవారంకోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసారు. కస్టడీకి వచ్చిన అనంతరం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఎంత మందిని రిక్రూట్ చేశారు, ఐసిస్ ఉగ్రవాదులతో వీళ్లకున్న సంబంధాలు ఏంటి అనే అంశాలపై వీరిని విచారించనున్నారు. అలాగే బాంబు పెట్టేందుకు ఎక్కడెక్కడ టార్గెట్‌లు పెట్టారు అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో అమ్మోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను సీజ్ చేశారు. అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, సెల్స్ సిరాజ్ ఆర్డర్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సిరాజ్ పలుమార్లు సౌదీకి వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంటే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల విచారణ తర్వాత ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేస్తే.. ఎన్‌ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఈ కుట్ర కోణాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. మిగిలిన నలుగురు వ్యక్తులు ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.