Israel : పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. సిరియా రాజధాని డమాస్కస్ లోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతిచెందగా 34 మంది గాయపడ్డారు. సిరియా అధ్యక్ష భవనానికి అత్యంత సమీపంలోనే ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్స్ బలగాలు ఈ దాడులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సిరియా సువేదా ప్రాంతంలోని మైనారిటీ షియా తెగకు చెందిన ద్రూజ్ జాతీయులకు మద్దతుగా ఈ దాడులు జరిపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.
Israel Air Strike on Syria
వాస్తవానికి 4 రోజుల క్రితం ద్రూజ్ జాతీయులకు, సున్నీ బెడ్విన్ తెగ మధ్య సాయుధ ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘర్షణలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపునకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. డ్రూజ్ గ్రూపునకు మద్దతు పేరుతో బుధవారం ఉదయం, సాయంత్రం వేళల్లో.. సిరియా రక్షణశాఖ కార్యాలయం ప్రధాన ద్వారంవద్ద, అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో బాంబుల వర్షం కురిపించింది. సిరియా సైనిక దళాల కాన్వాయ్‌పైనా బాంబులేసింది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది ద్రూజ్ జాతీయులు ఉండగా సిరియాలో సగం మంది ఉన్నారు.
మరోవైపు సిరియాలోని దక్షిణ ప్రాంత నగరం స్వెయిదాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపులకు మధ్య బుధవారం ఉదయం మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘర్షణలు జరగడం గమనార్హం. స్వెయిదాలో స్థానిక సున్నీ బెదోయిన్ గిరిజన తెగలు, డ్రూజ్ వర్గాల మధ్య కిడ్నాప్‌లు, దాడులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ బలగాలు… డ్రూజ్ సభ్యులను భారీగా హతమార్చడంతోపాటు వారి ఇళ్లను తగలబెట్టాయి. అయితే డ్రూజ్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో రెండు వర్గాలు సాయంత్రానికి దిగివచ్చాయి. మళ్లీ కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇప్పటిదాకా ఘర్షణల్లో 250 మంది వరకూ మృతి చెందినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల పరిశీలక సంస్థ వెల్లడించింది. ఇందులో 138 మంది సైనికులున్నారని తెలిపింది.
Also Read : Gang Rape: రాజస్తాన్ లో దారుణం ! కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్ రేప్ !
