#LalBahadurShastri : భారతీయతకు నిలువెత్తు రూపం లాల్ బహుదూర్ శాస్త్రి
January 11 on the occasion of Lal Bahadur Shastri Death Ceremony
Lal Bahadur Shastri : ఉత్తరప్రదేశ్, వారణాసి సమీప ముగల్‌సరాయ్ పట్టణంలో రమాదులారి దేవి మరియు శారద ప్రసాద్ శ్రీవాస్తవల ముద్దుబిడ్డగా లాల్ బహుదూర్ శాస్త్రీ 02 అక్టోబర్ 1904న జన్మించారు. మహాత్మాగాంధీ పుట్టిన రోజుననే శాస్త్రి జన్మించడంతో లాల్ బహుదూర్ (Lal Bahadur Shastri )జయంతి కొంత మరుగున పడడం జరుగుతున్నది. శాస్త్రి తన ఒకటిన్నర ఏళ్ల లోనే తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో ఎదిగారు. ప్రతి రోజు మైళ్ల దూరం చెప్పులు లేకుండా కాలినడకతో మరియు పడవకు డబ్బులు లేని కారణంగా ఈదుతూ నది దాటి వారణాసికి చేరి పాఠశాల విద్యను పూర్తి చేసి, దేశభక్తితో భారత జాతీయ కాంగ్రేస్‌లో చేరారు. కులమతాలకు అతీతంగా సేవలందిస్తూ, తన పేరులోని ‘శ్రీవాస్తవా’ ఇంటి పేరును తొలగించుకున్న మహానుభావుడిగా శాస్త్రి మనందరికీ ఆదర్శప్రాయుడు మరియు అనుసరణీయుడిగా నిలిచారు.
స్వామి వివేకానంద, మహాత్మాగాంధి మరియు అన్నీ బిసెంట్‌ల జీవితాలతో ప్రభావితం అయిన శాస్త్రి, చదువులకు స్వస్తి పలికి, విదేశీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొంటూనే హరిజనోద్ధరణకు కృషి చేశారు. కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి ‘శాస్త్రి (స్కాలర్)’ అనే బిరుదు పొందారు. 1928లో కట్నంగా చరకా మరియు ఖాదీ వస్త్రాలను మాత్రమే తీసుకొని లలితా దేవిని వివాహమాడారు. జి బి కృపలాని, లాలా లజపతిరాయ్ లాంటి ప్రముఖులతో కలిసి జాతి ఉద్ధరణ యజ్ఞంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ మూడున్నరేళ్లు (1928/1940) జైలు పాలైనారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహాల లాంటి జాతీయ ఉద్యమాలలో క్రియాశీలంగా పని చేసి అందరి మన్ననలు పొందారు.
స్వాతంత్రం అనంతరం 1947లో యూపి అసెంబ్లీలో గోవింద్ బల్లబ్ పంత్ నేతృత్వంలో రవాణా మరియు పోలీస్ శాఖల మంత్రిగా పనిచేస్తూ మెుదటిసారి మహిళా డ్రైవర్లు మరియు కండక్టర్‌లను నియమించడంతో పాటు మత అల్లర్లపై ఉక్కుపాదం మోపారు. 1951లో జాతీయ కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శిగా 1952, 1957 మరియు 1962 లోకసభ ఎన్నికల విజయప్రస్థానంలో భాగస్వామి అయినారు. నెహ్రూ చొరవతో 1951లో రాజ్యసభ సభ్యుడిగా నియమించబడ్డారు. భారత విదేశాంగ, రైల్వే, వాణిజ్య – పరిశ్రమలు, రవాణా – సమాచార మరియు హోంశాఖల మంత్రిగా తన సత్తా చాటారు. అలీనోద్యమ నేతగా శ్రీలంక తమిళుల సమస్యకు పరిష్కారం చూపే ‘సిరిమావో-శాస్త్రి ఒప్పందం’పై సంతకం చేశారు. రైల్వేశాఖ మంత్రిగా పని చేసిన సందర్భంగా జరిగిన రైలు ప్రమాదానికి మంత్రిగా భాద్యత వహించి రాజీనామా చేసి ఆదర్శంగా నిలిచి, ప్రజల మన్ననలు పొందారు.
జవహర్ లాల్ నెహ్రూ(Lal Bahadur Shastri )మరణానంతరం (27 మే 1964) భారతదేశ 3వ ప్రధానిగా (9 జూన్ 1964 – 11 జనవరి 1966) విశిష్ట సేవలు అందించిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిబద్దతగల దేశభక్తికి నిలువెత్తు రూపమైన శాస్త్రి చొరవతో ‘శ్వేత విప్లవం’ మరియు ‘హరిత విప్లవాల’కు పుణాదులు పడ్డాయి. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో హోరెత్తించిన శాస్త్రి నేతృత్వంలో జరిగిన 1965 ఇండో-పాక్ యుద్ధాన్ని 22-రోజుల్లోనే విజయం సాధించారు. ఐరాస చొరవతో 10 జనవరి 1966న రష్యా తాష్కంట్ (ప్రస్తుత ఉజ్‌బెకిస్థాన్) ఒప్పందంతో యుద్ధ విరమణ జరిగిన మరుసటి రోజు 11 జనవరి 1966న అనుమానాస్పదంగా (విష ప్రయోగంతో) గుండె పోటుతో మరణించారు.
‘లిటిల్ డైనమో ఆఫ్ ఏ మాన్’గా పేరొందిన శాస్త్రీ(Lal Bahadur Shastri )అకాల మరణం జాతిని శోక సముద్రంలో ముంచింది. అమరత్వం పొందిన భరతమాత ముద్దుబిడ్డ పేరున ఢిల్లీలో ‘విజయ్ ఘాట్’ స్మారక స్పూర్తి చిహ్నం నిర్మించారు. 30 ఏళ్లకు పైగా జీవితాన్ని దేశానికి అంకితం చేసిన 5 అడుగుల 2 అంగుళాల సమర్థుడు లాల్ బహుదూర్ శాస్త్రి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మరణానంతరం ‘భారత రత్న’ ఆవార్డును ప్రకటించారు. ‘శారీరకంగా పొట్టి వాడిని అయినప్పటికీ మానసికంగా బహు గట్టి వాడినే’ అన్న మాటలను రుజువు చేసుకున్న లాల్ బహుదూర్ శాస్త్రి నైతికత, సహనశీలి, నిరాడంబర, నిస్వార్థ జీవనశైలి నేటి భారతీయులకు దీపస్తంభంగా దారి చూపుతున్నాయి. ‘భిన్నత్వంలో ఏకత్వం సాధించిన ఘనత నా భారతదేశానిది’ అంటూ నిత్యం జాతిహిత ఆలోచనలతో అసమాన్య దేశభక్తిని శ్వాసించిన లాల్ బహుదూర్ శాస్త్రీ జీవితం నేటి యువభారతానికి మార్గదర్శనం చేయాలని ఆశిద్దాం.
(11 జనవరి ‘లాల్ బహుదుర్ శాస్త్రి వర్ధంతి’ సందర్భంగా)

No comment allowed please