Justice NV Ramana: కోర్టు కేసులు పెరగడానికి కారణం లోపభూయిష్టమైన చట్టాలు – జస్టిస్ ఎన్.వి.రమణ
కోర్టు కేసులు పెరగడానికి కారణం లోపభూయిష్టమైన చట్టాలు - జస్టిస్ ఎన్.వి.రమణ
Justice NV Ramana : తొందరపాటుతో చేస్తున్న లోపభూయిష్టమైన చట్టాలవల్లే కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ (Justice NV Ramana) అభిప్రాయపడ్డారు. చట్టాలను లోపరహితంగా తీర్చిదిద్దడానికి భాగస్వాములందరితో సంప్రదించాలని సూచించారు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో ఈ కసరత్తు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘క్షేత్రస్థాయి వాస్తవాలు, రాజ్యాంగ సవరణలు, చట్టాల ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంది. చట్టాలు అమల్లోకి వచ్చిన దశాబ్దాల తర్వాతైనా ఏ సవరణలు నిజంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చాయన్న అంశాన్ని నిపుణులు, మేధావులు విశ్లేషించాలి.
దీనిద్వారా ఆ మార్పులు కేవలం లాంఛనప్రాయంగానే ఉన్నాయా.. వ్యవస్థ ఉద్దేశాన్ని నెరవేర్చాయా.. వాటిని తదుపరి సవరించాల్సిన అవసరం ఉందా.. అని నిర్ధారించుకోవాల్సి ఉంది’ అని అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని కట్టన్‌కులత్తూర్‌లో ఉన్న ఎస్‌ఆర్‌ఎం స్కూల్ ఆఫ్ లాలో శనివారం ‘లెక్స్‌పోజియం 2025- ద క్రాడిల్ ఫర్ ఫ్యూచర్ జ్యూరిస్ట్స్’ పేరుతో నిర్వహించిన జాతీయ కాంక్లేవ్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ కాంక్లేవ్‌లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, సీనియర్ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పాల్గొన్నారు.
Justice NV Ramana – మౌలిక వసతుల బాధ్యత ప్రభుత్వాలదే
న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజల అవసరాలను తీర్చేలా కోర్టులను మలచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని జస్టిస్ ఎన్.వి.రమణ (Justice NV Ramana) స్పష్టం చేశారు. ‘సకాలంలో ఖాళీలను భర్తీ చేసి, ప్రాసిక్యూటర్లను నియమించడంపైనే న్యాయ వ్యవస్థ సమర్థత ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు పరిపాలనా జోక్యం అతిగా ఉన్న కాలంలో నివసిస్తున్నాం. పేలవంగా రూపొందించిన అతి నిబంధనలు ఎక్కువ వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈ సంస్కృతే కేసుల పెండింగ్ భారాన్ని పెంచుతోంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కార్యనిర్వాహక వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను పాటించాలి. లేదంటే ప్రజలకు కోర్టులను ఆశ్రయించడం మినహా మరో గత్యంతరం ఉండదు’ అని పేర్కొన్నారు.
‘ప్రస్తుత నేర న్యాయ వ్యవస్థలో విచారణ ప్రక్రియే శిక్షగా మారింది. దీన్ని సరిదిద్దడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నుంచే సంస్కరణలు మొదలుపెట్టాలి. వారికి సంపూర్ణ స్వతంత్రతనిచ్చి కోర్టులకే జవాబుదారీగా ఉండేలా చూడాలి. తప్పులకు పోలీసులనూ జవాబుదారీ చేయాలి. లేదంటే తప్పుగా, నిదానంగా జరిగే దర్యాప్తులు అమాయక ప్రజల అనవసర నిర్బంధానికి దారితీస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్, టంగుటూరి ప్రకాశం, పటేల్, సి.రాజగోపాలాచారి.. వలస పాలకుల అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని జాగృతం చేశారు. న్యాయవాదులైన వీరంతా దేశం కోసం నిర్వహించిన పోరాటంలో తమ స్వేచ్ఛను త్యాగం చేశారు.
స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ రచన, శాసన వ్యవస్థల రూపకల్పనలోనూ న్యాయవాదులు కీలకపాత్ర పోషించారు. న్యాయ వ్యవస్థపై ఉన్న గురుతర బాధ్యతను వారి వారసత్వం గుర్తు చేస్తోంది. కానీ ప్రస్తుత రోజుల్లో శాసన వ్యవస్థలోకి కొద్దిమంది న్యాయవాదులే ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం ఎదుటివారి దురదృష్టాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్నారన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ఫీజు కోసం వాళ్లు ఒక కారణాన్ని సృష్టిస్తారని.. ఎంత చెడులోనైనా మెరిట్స్‌ను, ఎంత మంచిలోనైనా లోపాలను చూపుతారని, 5 రూకలు ఈ రోజు నేరస్థుణ్ని సృష్టిస్తే.. పది రూకలు రేపు వారి మరకను చెరిపేస్తాయన్న నానుడి ఉంది. న్యాయవాదులు ఆర్థిక ప్రయోజనాలకు అతీతంగా పనిచేయాలి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ (Justice NV Ramana) సూచించారు.
‘ధర్మాసనాల్లో వైవిధ్యం, సమ్మిళితం ఉండాలి. 75 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటివరకూ 11 మంది మహిళలే న్యాయమూర్తులు కాగలిగారు. మన వ్యవస్థలు మన సామాజిక స్వరూపాన్ని ప్రతిబింబించాలి. మనకు గొప్ప రాజ్యాంగం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థ సమర్థంగా పనిచేయడం లేదు. దాన్ని సరిగా అమలు చేసేలా కృషి చేసి… రాజ్యాంగం లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రయత్నించాలి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ (Justice NV Ramana) పిలుపునిచ్చారు.
Also Read : USA: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం ?
