Justice Sudershan Reddy: ‘సల్వా జుడుం’పై తీర్పు నా వ్యక్తిగతం కాదు – జస్టిస్ సుదర్శన్ రెడ్డి
‘సల్వా జుడుం’పై తీర్పు నా వ్యక్తిగతం కాదు - జస్టిస్ సుదర్శన్ రెడ్డి
Justice Sudershan Reddy : వామపక్ష తీవ్రవాదం బలపడటానికి సల్వా జుడుంపై సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు కారణమంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి (Justice Sudershan Reddy) ఘాటుగా స్పందించారు. తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అని, తాను వ్యక్తిగతంగా ఇచ్చిన తీర్పుకాదని ఆయన వివరణ ఇచ్చారు. డిబేట్‌లో డీసెన్సీ అనేది ఉండాలని, అయితే ఈ విషయంలో హోం మంత్రితో తాను డిబేట్ చేయదలచుకోవడం లేదని మీడియాతో అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీగానే చూడాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశ ప్రజాస్వామ్యంలో లోటు కనిపిస్తోందని, రాజ్యాంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.
Justice Sudershan Reddy Key Comments
‘‘కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను. కానీ, అది నా తీర్పు కాదు.. సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చినది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నా. ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం’’ అని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఏకగ్రీవంగా ఎంపికచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఇది 64శాతం ప్రజల ప్రాతినిధ్యాన్ని సూచిస్తోంది. ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నిక అనేది ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ కాదు, రెండు భావజాలాల మధ్య పోటీ. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమే. వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవి. దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదు.
అమిత్‌షా ఏమన్నారంటే ?
‘ఇండియా’ కూటమి అభ్యర్థిని ఉద్దేశించి అమిత్ షా కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… సుదర్శన్ రెడ్డి ఇచ్చిన సల్వాజుడం తీర్పుతో వామపక్ష తీవ్రవాదం బలపడిందని ఆరోపించారు. నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుదర్శన్‌రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వా జుడుం’ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదన్నారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసిందని ఆరోపించారు.
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను నిలబెట్టింది. ఇందుకు ప్రతిగా ‘ఇండియా’ కూటమి బి.సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. నామినేషన్ల గడువు పూర్తికావడంతో ఇప్పుడు ముఖాముఖీ పోరు నెలకొంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి.
Also Read : PM Narendra Modi: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ – ప్రధాని మోదీ
