K V Rajendranath Reddy: ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు !
ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు !
K V Rajendranath Reddy:ఏపీలో అధికార వైసీపీకు కొమ్మకాస్తూ… ప్రతిపక్ష పార్టీలపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు స్పందించింది. వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఆయన్ను బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనే డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగవని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి.
K V Rajendranath Reddy:
ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్ కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఆయన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించేసి… వెంటనే రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించేందుకు వీలుగా ముగ్గురు డీజీ ర్యాంకు ఐపీఎస్ అధికారుల పేర్లు, వివరాలతో సోమవారం ఉదయం 11 గంటల్లోగా ప్యానల్ జాబితా సమర్పించాలని ఆదేశించింది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్‌ల వివరాలను ప్యానల్‌తో పాటు పంపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు రాజేంద్రనాథరెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు.
1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన రాజేంద్రనాథ్ రెడ్డి(K V Rajendranath Reddy) వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలకమైన పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీపీగా, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. కొన్నాళ్ల పాటు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా కూడా పనిచేసారు. ఆ పోస్టులో ఉండగానే ఇన్‌ఛార్జి డీజీపీగా ప్రభుత్వం నియమించింది. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టేసి మరీ 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోం శాఖ పదే పదే లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి(K V Rajendranath Reddy)పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో… నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. కొత్త డీజీపీ నియామకం కోసం వీరి ముగ్గురి పేర్లు ప్యానల్ జాబితాలో పంపించే అవకాశం ఉంది. వీరు ముగ్గురిలో ఎవరినైనా వద్దనుకుంటే… హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పేరు జాబితాలో చేరొచ్చు.
Also Read :-Zakia Wardak: 25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్ దౌత్యవేత్త ! పదవికి రాజీనామా !