Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్ట్
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్ట్
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని ఓ మాసాజ్ సెంటర్ లో సేద తీరుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రేపు ఉదయం అంటే సోమవారం ఉదయం నెల్లూరు తీసుకొచ్చే అవకాశముంది.
వైసీపీ హయాంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగించారని మైనింగ్ అధికారి పేర్కొన్నారు. ప్రశ్నించిన గిరిజనులను బెదిరించారన్నారన్నారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి… ముందస్తు బెయిలు పిటిషన్‌తో పాటు తనపై కేసును కొట్టేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిలు పిటిషన్ వేసినా ఎదురుదెబ్బే తగిలింది. దీనితో గత రెండు నెలలుగా పరారీలో ఉన్న కాకాణి ఎట్టకేలకు కేరళలో ఏపీ పోలీసులకు చిక్కారు.