Kaleshwaram Commission: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కూ జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీనితోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్… నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీకంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణసంస్థల ప్రతినిధులు.. ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది. గత నెలాఖరులో ఒక నెల మాత్రమే గడువు పొడిగించింది. దీనిప్రకారం ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తికావాలి. ఈ నెల 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారనే ప్రచారం జరిగింది. అయితే విచారణలో… సీనియర్ ఇంజినీర్లు, అధికారుల్లో ఎక్కువమంది గత ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయాలు జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలుచేశామని చెప్పిన నేపథ్యంలో… వీటిపై కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలనే నిర్ణయంతో కమిషన్ ఉన్నట్లు సమాచారం.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్,హరీష్‌రావు,ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించింది.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా కమిషన్ నోటీసులిచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారికి కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.