Kaloji Narayana Rao: ప్రజాకవి కాళోజీ
తెలంగాణా ప్రజల ఉద్యమ ప్రతిధ్వని కాళోజీ
కాళోజీ నారాయణరావు
Kaloji Narayana Rao : కాళోజీ నారాయణరావు (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002): తెలంగాణా ప్రజల ఉద్యమ ప్రతిధ్వనిగా కొనియాడబడే కాళోజీ అలియాస్ కాళోజీ నారాయణరావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తల్లి కన్నడ ఆడపడుచు కాగా తండ్రి మహారాష్ట్రీయుడు.
Kaloji Narayana Rao – ప్రజాకవిగా కాళోజీ
తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం సాధించిన కాళోజీ రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం కాళోజీ గేయాల్లో రూపుకడతాయి. కాళోజీ(Kaloji Narayana Rao) రచనల్లో అణా కథలు, నా భారతదేశయాత్ర, పార్థివ వ్యయము, నా గొడవ, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇదీ నా గొడవ, బాపూ!బాపూ!!బాపూ!!! ముఖ్యమైనవి. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను కాళోజీ తెలుగులోకి అనువదించాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష.
ఉద్యమ ప్రతిధ్వనిగా కాళోజీ
‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించిన కాళోజీ… మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ(Kaloji Narayana Rao) అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించాడు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది.. అని నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తిన ప్రజాకవి, వైతాళికుడు కాళోజీ.
రాజకీయ జీవి తం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా స్వతంత్ర్య సభ్యుడిగా 1958 నుండి 1960 వరకు పనిచేసారు. “ఆంధ్ర సారస్వత పరిషత్” వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్న కాళోజీ తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగానూ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ పనిచేసారు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పై పోటీ చేసి ఓటమి చెందారు.
కాళోజీ పురష్కారాలు
ప్రజాకవి కాళోజీని కేంద్ర ప్రభుత్వం 1992లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ తో సత్కరించింది. కాళోజీ జన్మదినాన్ని పురష్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరు 9 న తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తోంది. వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టడటమే కాకుండా హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు.
Also Read : Dwivedula Visalakshi: ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి