Kamal Haasan: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కమల్ హాసన్
Kamal Haasan : మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్, మంత్రి ఉదయ నిధి స్టాలిన్ హాజరయ్యారు. ఇటీవల తన చిత్రం ‘థగ్ లైఫ్’ ఈవెంట్ లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనితో బుధవారం వేయాల్సిన రాజ్యసభ నామినేషన్‌ను కమల్ వాయిదా వేసుకున్నారు. సినిమా వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. థగ్ లైఫ్ చిత్రం గురువారం విడుదలవడంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు. కమల్ తో పాటు మరో ముగ్గురు డీఎంకే నేతలు రాజ్యసభకు నామినేషన్ వేశారు.
Kamal Haasan Files Nomination
కమల్ హాసన్(Kamal Haasan) 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. విపక్ష ఇండియా కూటమిలో చేరారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించింది. ఇందుకుగాను చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం చేసింది. దీనితో 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు.
ఇటీవల నిర్వహించిన ‘థగ్‌లైఫ్’ సినిమా ఈవెంట్లో తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ వ్యాఖ్యానించడంతో భాషా వివాదం మొదలయ్యింది. కమల్ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనితో కర్ణాటకలో థగ్‌లైఫ్ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కమల్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. దీనితో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్‌హాసన్ నిర్ణయించారు.
Also Read : CM Rekha Gupta: ఢిల్లీ సీఎంకు బాంబు బెదిరింపులు ! భద్రత పెంపు !