Kamal Nath : చౌహాన్ సర్కార్ పై కమల్ నాథ్ కన్నెర్ర
అవినీతి, అక్రమాలకు రాష్ట్రం కేరాఫ్
Kamal Nath : మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్(Kamal Nath) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అవినీతి తారా స్థాయికి చేరుకుందని ఆరోపించారు. శుక్రవారం కమల్ నాథ్ మీడియాతో మాట్లాడారు. అడ్డు అదుపు లేకుండా బాధ్యత లేని సర్కార్ నడుస్తోందని ధ్వజమెత్తారు.
ప్రధానంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో మహాకాళ్ లోక నిర్మాణంలో అంతులేని అవినీతి చోటు చేసుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదలి వేసి కులం, మతం, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందంటూ మండిపడ్డారు.
సమస్యలతో జనం సతమతం అవుతుంటే సీఎం చౌహాన్ ఎంజాయ్ చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు కమల్ నాథ్. మహాకాల్ లోక్ నిర్మాణం పనుల్లో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే దీని విషయంపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ హయాంలో స్కాములు ఎక్కువై పోయాయని ఆరోపించారు. ప్రతి పథకం , ప్రతి పనిలో కాసులు లేనిదే పనులు కావడం లేదంటూ ఆరోపించారు కమల్ నాథ్. పోషకాహార పిల్లల పథకంలో కూడా అవినీతి తారా స్థాయికి చేరిందని కానీ నిస్సిగ్గుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం.
ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు వెంటనే జరపాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read : సంజయ్ రౌత్ కు షాక్ కస్టడీ పొడిగింపు