Kamareddy : తెలంగాణాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డి (Kamareddy) వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీనితో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
పోచారం జలాశాయానికి భారీగా వరద పోటెత్తడంతో మెదక్, బోధన్ ప్రధాన రహదారిపై హై లెవల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో మార్గం నుంచి వాహనాలు ప్రయాణించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Kamareddy – రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మరో రెండు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో శుక్ర,శని వారాల్లో కలెక్టర్ సెలవు ప్రకటించారు. నిర్మల్ ఇంకా రెడ్ అలర్ట్‌లోనే ఉందని కలెక్టర్ అభినవ్ తెలిపారు. అత్యవసరం అయితే, తప్ప బయటకు రావొద్దన్నారు. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్మల్‌కు వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు.
తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు వేల మందిని రెస్క్యూ చేశామని… ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సహాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. 2 వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్‌లో పెట్టామని తెలిపారు.
‘‘ఎన్డీఆర్‌ఎఫ్‌కు దీటుగా ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని.. భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా రెస్క్యూ చేస్తున్నామన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్ గత ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ నిరంతరం రివ్యూ చేస్తున్నాం. వర్షాకాలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతేనే బయటకు రండి. ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది’’ అని డీజీపీ చెప్పారు.
ఎన్‌హెచ్ 44పై 15 కి.మీ మేర ట్రాఫిక్‌జామ్
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని 44వ నంబరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సుమారు గంటకు పైగా ఈ పరిస్థితి నెలకొంది. సదాశివనగర్ మండలం నుంచి భిక్కనూర్ టోల్‌గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
బుధవారం, గురువారం కురిసిన వర్షాలకు టెక్రియాల్, సారంపల్లి వద్ద బ్రిడ్జి కోతకు గురైంది. మరోచోట రోడ్డు కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురువారం రాత్రి కూడా వాహనాలు పెద్దఎత్తున నిలిచిపోవడంతో పరిస్థితిని ఎస్పీ రాజేశ్ చంద్ర పర్యవేక్షించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా రహదారులకు మరమ్మతులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : NIA: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
