Kanchegachibowli Land: తెలంగాణా రాజకీయాల్లో కాక రేపుతోన్న కంచ గచ్చిబౌలి భూ వివాదం
తెలంగాణా రాజకీయాల్లో కాక రేపుతోన్న కంచ గచ్చిబౌలి భూ వివాదం
Kanchegachibowli : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం తుదితీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ భూములపై హక్కుల కోసం హైకోర్టు(High Court), సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పోరాడిందని… కాబట్టి యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదని పేర్కొన్నారు. ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. దీనితో ఈ భూముల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కూడా భాగముందంటూ విపక్షాలు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలపునివ్వడంతో… తెలంగాణా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Kanchegachibowli Land Issue
ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించేందుకు బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూ సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు హెచ్‌సీయూ(HCU) సందర్శనకు పిలుపునిచ్చిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటి ఎదుట పోలీసులు మోహరించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. దీనితో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు… వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
అసలు కంచ గచ్చిబౌలి భూ వివాదం ఏమిటంటే ?
‘‘ 2003 జనవరి 13న నాటి ప్రభుత్వం ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు మెమో నం.39612/ఏఎస్‌ఎస్‌ఎన్/వి(2) 2003 ప్రకారం కంచ గచ్చిబౌలి గ్రామంలోని భూమిని కేటాయించింది. ఆ సంస్థ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబరు 21న కేటాయింపును రద్దు(నం.111080/ఎస్1/2003) చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంటుకు కేటాయించింది.
ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఏపీలో రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు ఈ భూమి ప్రభుత్వానిదని వాదనలు వినిపించాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాదనలు వినిపించింది. దీనితో 2024 మార్చి 7న హైకోర్టు(High Court) ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని ఐఎంజీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా పటిష్ఠమైన వాదనలు వినిపించడంతో 2024 మే 3న సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. దీనితో 400 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి దక్కాయి.
2024 జూన్ 19న ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆ భూమిని కేటాయించాలని టీజీఐఐసీ ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రెవెన్యూశాఖ జూన్ 24న ఆ భూమి హక్కులను టీజీఐఐసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు భూమికి పంచనామా నిర్వహించి జులై 1న అప్పగించారు. ఆ భూమి అటవీ పరిధిలో లేదని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టమవుతోంది. జులై 19న వర్సిటీ రిజిస్ట్రార్, ఇంజినీర్, ఈఈతో కలిసి రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సర్వే చేసి హద్దులు నిర్ధారించారు. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పికాక్ లేక్ లు లేవు. టీజీఐఐసీ రూపొందించే లేఅవుట్‌లో మష్‌రూమ్ రాక్స్ తోపాటు ఇతర రాళ్ల అమరికను హరిత స్థలాలుగా పరిరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది’’ అని పొంగులేటి పేర్కొన్నారు.
400 ఎకరాల భూ బదలాయింపుపై డాక్యుమెంట్ల విడుదల చేసిన ప్రభుత్వం
భూ వివాదం నెలకొన్న నేపథ్యంలో కంచ గచ్చిబౌలిలోని(Kanchegachibowli) 400 ఎకరాలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం మీడియాకు విడుదల చేసింది. వాటిలో ఉన్న సమాచారం ప్రకారం… కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూకి చెందిన సర్వే నెంబరు 25లోని 534.28 ఎకరాల భూమిని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి స్వాధీనపర్చింది. దీనికి ప్రతిగా గోపనపల్లిలో సర్వే నంబరు 36, 37లో 397.16 ఎకరాలను ప్రభుత్వం వర్సిటీకి బదలాయించింది. దీనికి సంబంధించి అప్పటి రిజిస్ట్రార్ వై.నరసింహులు సంతకం చేసిన కాపీలను సీఎంవో విడుదల చేసింది.
ఆ భూములను వేలం వేయడం కుదరదు – బండి సంజయ్
కంచె గచ్చిబౌలి(Kanchegachibowli) భూముల పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని ఆయన అన్నారు. ఆ భూములను వేలం వేయడం కుదరదని… ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదును పేరుతో కోర్టు ధిక్కారణకు పాల్పడుతోందని బండి సంజయ్ విమర్శించారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి రూ. వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు.
కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
కంచె గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వట ఫౌండేషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. అత్యవసర విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఆ 400 ఎకరాలు హెచ్‌సీయూ భూమి అని, అటవీ భూమిలో వన్య మృగాలకు ఆవాసం ఉండదని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వట ఫౌండేషన్ 400 ఎకరాల వివాదాస్పద భూముల వ్యవహారంపై ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది.
Also Read : Gas Cylinder Blast: బెంగాల్ లో విషాదం ! గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి !