Kapil Sibal: ప్రధాని మోదీ సీజేఐ ఇంటికి వెళ్లడంపై కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ విసుర్లు !

ప్రధాని మోదీ సీజేఐ ఇంటికి వెళ్లడంపై కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ విసుర్లు !

Kapil Sibal: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమానికి బుధవారం ప్రధాని మోదీ హాజరు కావడాన్ని సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌(Kapil Sibal) తప్పుపట్టారు. ఎవరైనా సరే… వ్యవస్థలపై వదంతులు చెలరేగే పరిస్థితులను సృష్టించడం సరి కాదని అన్నారు. ఇది తప్పుడు సంకేతం పంపిస్తుందన్న విషయాన్నైనా ఆయనకు ఎవరైనా చెప్పి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అంతేకాదు అత్యున్నత పదవులు నిర్వహించే వ్యక్తులు… ఓ ప్రైవేటు కార్యక్రమాన్ని ప్రచారానికి వాడుకోవడం సరికాదని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కపిల్ సిబల్(Kapil Sibal) తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా… ‘‘సీజేఐ నివాసానికి వెళ్లిన మోదీ(PM Modi) వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యా. దాదాపు 50 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో, ఈ వ్యవస్థలో ఉన్నాను. గొప్ప గొప్ప న్యాయమూర్తులను చూశాను. ఈ వ్యవస్థ అంటే మాకందరికీ ఒక వ్యామోహం. ప్రస్తుత సీజేఐపై నాకు అపార గౌరవం ఉంది. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి. వీడియోను ప్రచారం కోసం వాడుకుంటారని ఆయన అనుకొని ఉండరు’’ అని సిబల్‌ పేర్కొన్నారు.

కార్యానిర్వాహక, న్యాయాధికారాల మధ్య ఉండాల్సిన విభజన రేఖతో సీజేఐ రాజీ పడ్డారని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. ‘‘సీజేఐ స్వతంత్రత మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయాం. దీన్ని సుప్రీంకోర్టు బార్‌ అసోషియేషన్‌ బహిరంగంగా ఖండించాలి’’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

Kapil Sibal – సీజేఐ కేసుల విచారణ నుంచి సీజేఐ తప్పుకోవాలి – శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌

తిరుగుబాటు శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించిన కేసుల విచారణ నుంచి సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తప్పుకోవాలని శివసేన(యూబీటీ) నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ రక్షకులను రాజకీయ నేతలు కలవడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోందని అన్నారు. ‘‘కేసుల నుంచి సీజేఐ తప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానితో ఆయనకు ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయి’’ అని పేర్కొన్నారు. బాల్‌ ఠాక్రే స్థాపించిన శివసేన రెండేళ్ల కిత్రం రెండుగా విడిపోయింది. ఏక్‌ నాథ్‌ శిందే నేతృత్వంలోని ఒక శివసేన… ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో శివసేన (యూబీటీ) ఏర్పడ్డాయి. ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు వేసుకున్న కేసులు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. ‘‘చంద్రచూడ్‌ ముందుకు మా కేసులు వెళతాయి. ఈ కేసుల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పక్షంగా ఉంది. మా కేసులు సీజేఐ దగ్గరకు వెళితే న్యాయం జరుగుతుందా లేదా అన్న అనుమానం మాకు కలుగుతుంది’’ అని రౌత్‌ తెలిపారు.

సీజేఐని కలిస్తే తప్పేంటి ? – బీజేపీ ఎంపీ సంబిత్‌ పాత్ర

సీజేఐ నివాసంలో జరిగిన గణపతి పూజకు మోదీ హాజరుకావడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ మండిపడింది. సీజేఐని ప్రధాని కలిస్తే తప్పేంటని ప్రశ్నించింది. ‘‘సీజేఐని ప్రధాని కలిస్తే అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసిన యూఎస్‌ చట్ట సభ్యురాలు ఇల్హన్‌ ఒమర్‌ను రాహుల్‌ గాంధీ కలిస్తే మాత్రం ఎవరూ మాట్లాడరు’’ అని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు. సీజేఐని ప్రధాని కలవడం.. భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.

Also Read : Mamata Banerjee: నేను రాజీనామాకు సిద్ధమే – సీఎం మమతా బెనర్జీ

Leave A Reply

Your Email Id will not be published!