HD Kumara Swamy : ఆస్పత్రిలో చేరిన కుమారస్వామి
పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
HD Kumara Swamy : కర్ణాటక మాజీ సీఎం హెచ్ డి కుమారస్వామి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. మే10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుమార స్వామి(HD Kumara Swamy) రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జ్వరం రావడంతో కుమారస్వామి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో చేరారు. గతంలో మాజీ సీఎంకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరిగింది.
అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వెంటనే కుమార స్వామికి వైద్యులు చికిత్స చేపట్టారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని , ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం కుమార స్వామికి 63 ఏళ్లు. జ్వరంతో బాధ పడుతున్న కుమార స్వామికి మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ విషయాన్ని మాజీ సీఎం కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ 22 శనివారం సాయంత్రం మైసూర్ లోని డాక్టర్ సత్యనారాయణ సంరక్షణలోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. కుమార స్వామికి అన్ని వైద్య పరీక్షలు చేపట్టారు. ప్రస్తుతం ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు కాంగ్రెస్ , జేడీఎస్ బరిలో ఉంది. ఆయా పార్టీలతో పాటు ఆప్ , ఎంఐఎం కూడా బరిలో ఉంది.
Also Read : తెగిన బంధం రాహుల్ భావోద్వేగం