Kasu Mahesh Reddy: వైసీపీ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
వైసీపీ ఓటమిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
Kasu Mahesh Reddy: 99శాతం హామీలు అమలు చేసాం… 2024 ఎన్నికల్లో 175 కు 175 సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయింది. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీకు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి… ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసారు. దీనితో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఓటమికి గల కారణాలపై ఘోర పరాజయం పాలైన సిట్టింగ్ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు.
Kasu Mahesh Reddy Comment
తాజాగా వైసీపీ ఘోర పరాజయంపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) నిర్వేదం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి ఆయన కొత్త కారణం చెప్పుకొచ్చారు. నాసిరకం మద్యమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పారు. మద్యం తాగే వాళ్లు వైసీపీకి ఓటు వేయలేదన్నారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల, విజయసాయిరెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. అంతేకాదు మరికొన్ని కారణాలు కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించాయని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
వైసీపీలో కొందరు నాయకుల నోటి దురుసు కూడా ఓటమికి కారణమైందన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొంతమంది నాయకులు చంద్రబాబుని బూతులు తిట్టారని… ఇలాంటి అవమానాలు చంద్రబాబు, టీడీపీ శ్రేణులలో కసిని పెంచాయన్నారు. ఎవరిని అవమానాలకు గురి చేసినా వారిలో కసి పెరిగి విజయం సాదిస్తారని చరిత్ర చెబుతోందని… 2019లో జగన్ గెలిచినా, ఇప్పుడు చంద్రబాబు గెలిచినా అవమానాల నుంచి వచ్చిన కసే కారణం అని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ వాళ్లు గెలిచాక చాలా చోట్లు దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కార్యాలయాన్ని సైతం కూల్చివేశారన్నారు. కూల్చివేత చట్ట పరంగా జరిగినా… ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదని… తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామని చెప్పారు మహేష్ రెడ్డి.
Also Read : Nara Lokesh: వైసీపీ అక్రమ నిర్మాణాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం !