KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ! ముగిసిన విచారణ !
కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ ! ముగిసిన విచారణ !
KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… కాళేశ్వరం కమీషన్ ఎదుట హాజరయ్యారు. బీఆర్కే భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సుమారు 50 నిమిషాల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్ కు కేసీఆర్(KCR) పలు డాక్లుమెంట్లను అందించారు. మొదట దైవసాక్షిగా వాస్తవాలు చెబుతానని కేసీఆర్ చేత ప్రమాణం చేయించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్… మొత్తం 18 ప్రశ్నలను సంధించారు. రీ ఇంజనీరింగ్, కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ ఆమోదంపై కమిషన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రీ ఇంజనీరింగ్ చేయడానికి ప్రధాన కారణాలను కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్(KCR) అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. కేసీఆర్(KCR) వెంట హరీశ్‌రావు కూడా ఉన్నారు.
KCR – Kaleshwaram
ఇన్నాళ్లూ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావును విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. తాజాగా కేసీఆర్‌ను విచారించింది.
ఈ విచారణ సందర్భంగా కేసీఆర్(KCR)ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈక్రమంలో కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి కేసీఆర్(KCR) వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. క్యాబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని… అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు.
కాళేశ్వరం కార్పొరేషన్(Kaleshwaram) గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్‌ను కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. జీవో నంబర్ 45ను, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్‌ను కమిషన్‌కు అందజేశారు.
ప్రతిదీ కేబినెట్ ఆమోదంతో జరిగిందని కేసీఆర్ వివరణ ఇచ్చారు. కేబినెట్ ఆమోదంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. స్థల మార్పు నీటి లభ్యత, కాళేశ్వరం నిర్మాణంపై వ్యాప్కోస్ నివేదిక ఇచ్చిందని కమిషన్‌కు చెప్పారు. లైఫ్ లైన్ కాళేశ్వరం పుస్తకాన్ని కమిషన్‌కు అందజేశారు. అందులో కాళేశ్వరం ఉద్దేశ్యాలను వివరించారు. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. బ్యారేజీల్లో నీటి నిలువ అనేది ఇంజనీర్లు తీసుకునే నిర్ణయం తనకు సంబంధం లేదని కేసీఆర్ వెల్లడించారు.
బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా… తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని.. బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి నిర్మించినవి అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ లొకేషన్ మార్పు నిర్ణయం ఎవరిది అంటూ కమిషన్ మరో ప్రశ్న సంధించింది. లొకేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. సీడబ్ల్యూసీ తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పిందని.. వ్యాప్కోస్ సర్వే చేసి నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్ టీం మూడు బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదని చెప్పారు. టెక్నికల్ టీం ఇచ్చిన నివేదిక మేరకు లోకేషన్ మార్పు జరిగిందన్నారు. నిర్ణయాలన్నీ కేబినెట్ ఆమోదంతోనే జరిగాయని కేసీఆర్ చెప్పారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ముందు కార్యకర్తలకు అభివాదం చేశారు మాజీ సీఎం. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
యశోదా ఆస్పత్రికి కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ నేరుగా యశోదా ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేసీఆర్ పరామర్శించనున్నారు. కేసీఆర్ కాళేశ్వరం విచారణ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి సిద్దిపేటలోని ఫాంహౌస్‌కు వెళ్లారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు ఎమ్మెల్యే జారి పడ్డారు. ఈ క్రమంలో ఆయన తుంటి ఎముకలో గాయమైంది. వెంటనే ఆయనను హుటాహుటిన అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు.
Also Read : Suicide: భార్య వివాహేతర సంబంధానికి భర్త బలి
