హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. నిన్నటి దాకా ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు , మాజీ ఎంపీ సంతోష్ రావులను విచారించింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) . తాజాగా వీరితో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. ఇవాళ తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొంది నోటీసులో. దీనిపై సీరియస్ గా స్పందించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు . క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చారు. బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని వెల్లడించారు.
అయితే హైదరాబాద్ లోని నంది నగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. 65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేశారు కేసీఆర్.తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని, నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ సందర్బంగా సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును ఉటంకించారు కేసీఆర్.
