KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ మీటింగ్ !
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ మీటింగ్ !
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ మీటింగ్ !
తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అధ్యక్షతన ఎర్రవల్లి ఫాం హౌస్ లో శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ తుంటి ఎముక గాయానికి ఆపరేషన్ చేసుకున్న తరువాత మొదటి సారిగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్‌రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి ఒకటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు జోష్‌లో ఉండడం, జాతీయ విధానాలపై జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏఏ అంశాలతో ఎన్నికలకు వెళ్లాలన్న అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయి. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలి. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలి. విభజన చట్టం ప్రకారం తెలంగాణా రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నించాలి. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం. ఆపరేషన్ మ్యానువల్, ప్రొటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదాం. త్వరలోనే నేను ప్రజల్లోకి వస్తా’’ అని కేసీఆర్ తెలిపినట్లు సమాచారం. దీనితో కేసీఆర్ ప్రజల్లోకి వస్తానని చెప్పడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ పార్టీ మీటింగ్‌లో రాబోయే ప్రెసిడెన్షియల్ అడ్రస్, ఓట్ ఆన్ ఎకౌంటు అనే రెండు అంశాలపైన చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ కోసం, తెలంగాణ బలం, గళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలేనని అన్నారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన విషయాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.