Kesineni Nani : డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
Kesineni Nani : 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరి… విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన మాజీ ఎంపీ కేశినేని నాని డీలిమిటేషన్(Delimitation) పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో ఓటమి తరువాత మౌనంగా ఉన్న నాని… దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై చర్చ జరుగుతోన్న వేళ ఈ వ్యాఖ్యలు చేసారు. డీలిమిటేషన్(Delimitation) పై తన ఫేస్ బుక్ వేదికగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫేస్ బుక్ వేదికగా మాజీ ఎంపీ కేశినేని(Kesineni Nani) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ… లోక్‌సభ నియోజకవర్గాల పునర్నిర్మాణం జనాభా ఆధారంగా జరగనుందని ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక,కేరళ వంటి జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నాని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్,బీహార్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందన్నారు. కానీ ఇది న్యాయమా ? అని ఆయన ప్రశ్నించారు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా ? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని… ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయని ఆయన సోదాహరణగా వివరించారు.
ప్రపంచంలో ఇతర దేశాలు సైతం ఈ తరహా సమస్యలను ఎదుర్కొన్నాయన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా (39 మిలియన్ జనాభా) 52 లోక్‌సభ సీట్లు కలిగి ఉండగా, వైయోమింగ్ (0.58 మిలియన్ జనాభా) కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు.దీనితో సెనేట్ లో రెండు రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో రాజ్యసభను బలోపేతం చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సమతుల్యం చేయాలని తాను భావిస్తున్నానంటూ ఆయన తన పోస్ట్‌లో విశదీకరించారు.
కెనడాలోని ప్రిన్స్‌ఎడ్వర్డ్ ఐలాండ్ (167K జనాభా)కు 4 పార్లమెంటు స్థానాలుండగా… అల్బెర్టా (4.4M జనాభా)కు 34 సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇది చిన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఇచ్చే విధానమని పేర్కొన్నారు. భారతదేశంలో సైతం చిన్న రాష్ట్రాలను పరిరక్షించే విధానాన్ని అవలంబించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Kesineni Nani – పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ఓ ఉదాహరణ
పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ రాష్ట్రం రాజకీయ అణచివేతకు ఓ ఉదాహరణ అని ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ భూభాగ పరంగా అతిపెద్ద రాష్ట్రం (44% భూభాగం)… అయినప్పటికీ అతి చిన్న జనాభా (12 మిలియన్) కలిగిన రాష్ట్రం. ఖనిజ సంపద (బంగారం,గ్యాస్,రాగి) ఎక్కువగా ఉన్నా ఆర్థికంగా,రాజకీయంగా చాలా వెనుకబడి ఉందని వివరించారు. మొత్తం 266 స్థానాల్లో బలోచిస్తాన్‌కు కేవలం 16(6%), కానీ పంజాబ్ (110M జనాభా)కు 141 సీట్లు (53%) ఉన్నాయన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు ఉన్నా, పంజాబ్ అధిక సంఖ్యలో లోక్ సభ సీట్లు కలిగి ఉండడం వల్ల దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోందని ఉదాహరించారు. పాకిస్తాన్ నేచురల్ గ్యాస్‌లో 40% బలోచిస్తాన్ నుండి వచ్చినా… బలోచులు దీని ద్వారా లాభాలు పొందడం లేదని ఉదాహరించారు.
భారతదేశంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు ఇలాగే వెనుకబడి పోతాయా? అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని(Kesinani Nani) సందేహం వ్యక్తం చేశారు. బలోచిస్తాన్ లాంటి తీవ్రస్థాయిలో కాకపోయినా, జనాభా ఆధారంగా మాత్రమే సీట్ల కేటాయింపు జరిగితే, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోవచ్చునన్నారు. ప్రస్తుతం.. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురైన సమస్యలే మరికొన్ని రాష్ట్రాలకు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన జాగ్రత్తగా నిర్వహించక పోతే, కొత్తగా ఉత్తర-దక్షిణ విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఇది దేశ ఐక్యత, అభివృద్ధికి ప్రమాదకరం. ఈ నేపథ్యంలో సమతుల్య,సమర్థమైన పద్ధతిలో పునర్విభజన జరగాలని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ వేదికగా ఆకాంక్షించారు.
Also Read : MLC Somu Veerraju: వైఎస్ జగన్ పై ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు