Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణపతి

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ మహా గణపతి

Khairatabad Ganesh : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ (Khairatabad Ganesh) నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్‌ మార్గ్‌ లోని బాహుబలి క్రేన్‌ పాయింట్‌ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అంతకుముందు వినాయకుడికి ఉత్సవ సమితి నిర్వాహకులు తుది పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం 7 గంటలకు బడా గణేశ్‌ (Khairatabad Ganesh) శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. రాజ్‌దూత్‌ సర్కిల్‌, టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా వినాయకుడు ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో శోభాయాత్ర మార్గంతోపాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీనితో ఖైరతాబాద్ మహా గణపతికి నభూతో నభవిష్యతి అనేలా కనివినీ ఎరుగని రీతిలో భక్తజనం ఘనంగా వీడ్కోలు పలికారు.

Khairatabad Ganesh Visarjan COmpleted

ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణపతి (Khairatabad Ganesh) భక్తులకు దర్శనమిచ్చాడు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది. ఇది ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల 71వ సంవత్సరం. కోట్లాది మంది భక్తులను నవరాత్రుల్లో బడా గణేషుని దర్శనం చేసుకుని పరవశించిపోయారు. తొమ్మిది రోజుల పూజల అనంతరం సరిగ్గా ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ గణేషుని శోభాయాత్ర ఆరంభమైంది. వెల్డింగ్ వర్క్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వినాయకుడి రథయాత్ర కన్నులపండువగా సాగింది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ట్యాంక్ బండ్ చేరుకుంది. సుమారు 70 అడుగుల భారీ క్రేన్ సాయంతో ఖైరతాబాద్ గణపతిని నెమ్మదిగా ఎత్తి, భక్తుల నినాదాల మధ్య హుస్సేన్ సాగర్‌లో గంగమ్మ ఒడికి చేర్చారు.

మరోవైపు నగరవ్యాప్తంగా ఉన్న వేలకొద్దీ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు రహదారులపై బారులు తీరారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్, ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. మహగణపతితో పాటు అనేక వినాయక విగ్రహాలు ఒకేసారి దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. ‘గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా’ నినాదాలతో గణపయ్యను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ‘జై జై గణేశా… బై బై గణేశా’ అంటూ ఏకదంతునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ అపుర్వ ఘట్టాన్ని వేలాది మంది ప్రజలు స్వయంగా వీక్షించగా.. కోట్లాది మంది టెలివిజన్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్షంగా చూసి పరవశించిపోయారు. ఇక, ఖైరతాబాద్ (Khairatabad Ganesh) శోభాయాత్ర జరిగే మార్గంలో ముందుగానే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాంక్‌ బండ్‌ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన సీఎం రేవంత్

హైదరాబాద్ నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్‌‌బండ్ వద్ద జరుగుతున్న గణేష్‌ నిమజ్జనాల వేడుకను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సందర్శించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా ట్యాంక్‌బండ్‌ కు సీఎం వచ్చినట్లు సమాచారం. నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు చేసిన భద్రత ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ వ్యక్తిగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించారు. రేవంత్ రెడ్డి రావడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ… ముందుకు కదిలారు. అత్యంత తక్కువ సంఖ్యలో భద్రత సిబ్బందితో.. మూడు కార్ల ఎస్కార్ట్‌తో సీఎం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. నిమజ్జనం జరుగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గణేశ్ (Khairatabad Ganesh) నిమజ్జనాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. వినాయక నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు.

ఆదివారం మధ్యాహ్నం వరకు వినాయక నిమజ్జనాలు – సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హుస్సెన్ సాగర్‌తో పాటు పలు చెరువుల వద్ద వినాయక నిమజ్జన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపుగా వచ్చే వివిధ రూపాల గణనాథులను చూడ్డానికి రెండుకళ్లు సరిపోవుడం లేదు.

ఈ నేపథ్యంలో నగర సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ… నగరంలో ఇంకా 4,700 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉందని సీపీ ఆనంద్‌ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది టెక్నాలజీ ఆధారంగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్‌తో విగ్రహాల గుర్తింపు, వివరాల నమోదు చేసుకున్నట్లు గుర్తు చేశారు. 9 డ్రోన్ కెమెరాల ద్వారా గణేష్‌ నిమజ్జనాల పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు జరిగేలా తెలంగాణలోని పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు సీపీ స్పష్టం చేశారు.

Also Read : CM Siddaramaiah: కర్ణాటక సీఎం కారుకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!