Khusbhu Sundar: కరూర్ తొక్కిసలాట ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
కరూర్ తొక్కిసలాట ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
Khusbhu Sundar : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని టీవీకే మొదటి నుంచి ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే నేతల ఆరోపణలకు మరింత ఆజ్యం పోస్తూ… బీజేపీనాయకురాలు, సినీ నటి కుష్బు సుందర్ (Khusbhu Sundar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. దీనితో ఆమె వ్యాఖ్యలు తమిళనాట కొత్త చర్చకు దారి తీశాయి.
Khusbhu Sundar key Comments
కరూర్ తొక్కిసలాట ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు కుష్బు సుందర్ (Khusbhu Sundar) మాట్లాడుతూ… ‘తమిళనాడు ప్రజలందరూ కరూర్ తొక్కిసలాట ఘటన నిర్లక్ష్యంగా జరిగిందని అనుకుంటున్నారు. కానీ, ఈ ప్రమాదం ప్లాన్ ప్రకారమే ఎవరో సృష్టించినట్టు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే విజయ్ ర్యాలీ నిర్వహించడానికి ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వలేదు. విజయ్ ర్యాలీకి ఎంత మంది అభిమానులు, ప్రజలు వస్తారు అనేది ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసు. అయినా కూడా ఇలా ర్యాలీకి తగిన స్థలం కేటాయించలేదు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన జరిగిన తర్వాత మౌనంగా ఉన్నారు. పలు ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?. ఈ దురదృష్టకర ఘటనలో 41 మంది మరణించారు. ఇప్పటికైనా స్టాలిన్ మాట్లాడాలి. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారని అధికారులు చెబుతున్నారు. అలా లాఠీఛార్జ్ ఎందుకు చేశారు?. ఇది ప్రణాళికాబద్ధంగా సృష్టించబడిన ఘటన అయి ఉండాలి’ అని ఆరోపించారు.
విజయ్‌కు బీజేపీ అగ్రనేత ఫోన్ ?
కరూర్ ఘటనలో డీఎంకే పార్టీనే మెయిన్ టార్గెట్ చేసుకుని బీజేపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే కంటే దూకుడు ధోరణి ప్రదర్శించడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. తాజాగా టీవీకే విజయ్‌తో బీజేపీ అగ్రనేత ఒక్కరు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఒకవేళ అధికార డీఎంకే అన్యాయంగా గనుక లక్ష్యంగా చేసుకుంటే… విజయ్ ఒంటరేం కాదని ఆ అగ్రనేత చెప్పినట్లు తెలుస్తోంది. డీఎంకే ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఓర్పు పాటించాలని.. వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేయమని ఆ ఢిల్లీ పెద్ద, విజయ్‌కు సూచించినట్లు సమాచారం.
కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం… ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు.. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించే వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read : Rajiv Pratap Rudy: విమానంలో కో పైలట్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ
