Kinjarapu Rammohan Naidu: గ్లోబల్ యంగ్ లీడర్‌గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
గ్లోబల్ యంగ్ లీడర్‌గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ఈ గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో టెక్ వ్యవస్థాపకుల నుంచి మానవ హక్కుల మరియు న్యాయవాదుల నుంచి ప్రపంచవ్యాప్తంగా తమ రంగాలలో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులు ఉన్నారు. ఈసారి భారత్ నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. వారిలో రామ్మోహన్ నాయుడు ఒకరు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ‘యంగ్ గ్లోబల్ లీడర్(Young Global Leader)’గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. నిజాయితీ, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేయాలని ఈ గుర్తింపు మరింత గుర్తు చేస్తుందని ఆయన అన్నారు.
మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు(Kinjarapu Rammohan Naidu) అకాల మరణంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు… 2014 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ లో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడు… 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి… దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
Kinjarapu Rammohan Naidu – తెలుగువారికి గర్వకారణం – చంద్రబాబు
యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపికైన రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమన్నారు. ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం… యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. రామ్మోహన్ యంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎంపిక కావడం ఏపీకి, భారత్‌కు గర్వకారణమని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నుంచి ప్రేరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
Also Read : India Justice Report 2025: న్యాయ వ్యవస్థ పనితీరులో ద్వితీయ స్థానంలో తెలంగాణ