Konidela Nagababu: టీటీడీ చైర్మెన్ నియామకంపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన నాగబాబు ?
టీటీడీ చైర్మెన్ నియామకంపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన నాగబాబు ?
Konidela Nagababu: ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టించింది. ఎన్డీఏ కూటమి ఏర్పడంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఎన్నికల్లో కూటమి అఖండ విజయానికి ముఖ్య కారణమయ్యారు. దీనితో అతని సోదరుడు నాగబాబును టీటీడీ చైర్మెన్ గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ ఘోర పరాజయంతో టీటీడీ చైర్మెన్ పదవికి భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేసారు. దీనితో కూటమి గెలుపుకోసం అనకాపల్లి సీటును త్యాగం చేసిన నాగబాబు… టీటీడీ చైర్మన్ కావడం ఖాయమనే వాదన బలమైంది. గురువారం ఉదయం నుంచి ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయంపై నాగబాబు(Konidela Nagababu) ఎక్స్ వేదికగా స్పందిస్తూ పోస్ట్ పెట్టారు. అంతేకాదు, తన భవిష్యత్ కార్యాచరణనూ వెల్లడించారు. ‘దయచేసి అసత్య వార్తలను ఎవరూ నమ్మకండి. పార్టీ అధికారిక, నా సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ అయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. దయచేసి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయకండి’ అని పేర్కొన్నారు.
Konidela Nagababu Comment
ప్రదాని మోదీని కలిసిన అనంతరం కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్… తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. ఈ సందర్భంగా చిరంజీవికి పాదాభివందనం చేసారు. అనంతరం అతని తల్లి అజంనాదేవి, వదిన సురేఖకి కూడా పాదాభివందనం చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంట్లో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు(Konidela Nagababu), పవన్ కళ్యాణ్ కుటుంబాలు పాల్గొన్నారు. ఈసందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… ఎన్నికల్లో కల్యాణ్‌బాబు విజయం సాధించిన సందర్భంగా కుటుంబసభ్యులంతా కలిసి గెట్ టు గెదర్‌లా చిన్న పార్టీ చేసుకున్నామన్నారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ వేడుకకు వచ్చినట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ కుటుంబం పవన్ కు అండగా ఉంటుందన్నారు. పార్టీకి సేవ చేయడం తప్ప పదవులపై తనకు ఆలోచన లేదన్నారు. జనసేనను ఇంకా ఉన్నతస్థానాలకు ఎలా తీసుకెళ్లాలా? అన్న ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం పైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నూటికి నూరు శాతం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నిలబెట్టిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోనూ అఖండ విజయం సాధించి తన పార్టీ వందశాతం విజయాన్ని నమోదు చేసుకొని రికార్డు సృష్టించారు పవన్ కళ్యాణ్. అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన బంధువులు ఎవరినీ తన పార్టీ తరపున నిలబెట్టలేదు. ముఖ్యంగా తన సోదరుడు నాగబాబు(Konidela Nagababu)ని కూడా ఎక్కడా నిలబెట్టలేదు. నాగబాబు మొదటినుండీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటూ, పార్టీకి ఎంతో సేవ చేశారు. ఒక సమయంలో నాగబాబుని అనకాపల్లి నుండి జనసేన పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టాలని వార్తలు వచ్చాయి. అలాగే నాగబాబు కూడా కొన్ని రోజులు అనకాపల్లిలో ఉండటం వలన ఈ వార్తలకి బలం చేకూరింది. కానీ అనూహ్యంగా నాగబాబుకు బదులు ఆ పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించడం, అక్కడ నుండి సీఎం రమేష్ పోటీ చేసి గెలవటం అవన్నీ తెలిసిన విషయాలే.
Also Read : AP Chief Secretary: ఏపీ సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ రవిచంద్ర?