KTR: రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం – మాజీ మంత్రి కేటీఆర్
రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం - మాజీ మంత్రి కేటీఆర్
KTR: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ రాజ్యాంగ విరుద్ధ చర్యలపై దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని కూడా కలుస్తామన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు ఫోజులు కొడుతూ మరోవైపు దానిని తుంగలో తొక్కుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్యనాయకులు శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సుమారు అరగంటసేపు భేటీ అయ్యారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ప్రొటోకాల్ ఉల్లంఘనపై గవర్నర్‌కు వినతిపత్రాలు సమరి్పంచి, అందులోని అంశాలను కేటీఆర్(KTR), హరీశ్‌రావు గవర్నర్ కు వివరించారు. అనంతరం గవర్నర్‌తో భేటీ వివరాలను కేటీఆర్ మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్(KTR) మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్నట్లు గవర్నర్ కు వివరించాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఓ వైపు న్యాయపోరాటం చేస్తున్నాం. మరోవైపు స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామనే విషయాన్ని గవర్నర్‌కు వివరించాం. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు, పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోచేరినా వారిపై చర్యలు లేవనే విషయాన్ని ప్రస్తావించాం.
ప్రొటోకాల్ ఉల్లంఘనతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పాం. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లడం సరికాదనే అభిప్రాయం గవర్నర్ వ్యక్తంచేశారు. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. విపక్ష పార్టీగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను కలవాలని గవర్నర్ చెప్పారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానన్నారు. నిరుద్యోగుల విషయంలో గవర్నర్ సీరియస్‌గా స్పందించిన తీరుకు అభినందనలు అని కేటీఆర్ అన్నారు.
KTR – గవర్నర్ సీరియస్‌గా స్పందించారు – కేటీఆర్
‘రాష్ట్రంలో యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీల ఉల్లంఘనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామనే హామీని నిలబెట్టుకోలేదు. సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి, కేసులతో భయానక వాతావరణం నెలకొంది. ఈ అంశంపై హోం శాఖ కార్యదర్శిని పిలిచి మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది’అని కేటీఆర్ చెప్పారు.
‘మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోయి కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు గంగపాలైందని భూతద్దంలో చూపుతూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. కొద్దిరోజుల్లోనే మరమ్మతులు పూర్తయి ప్రస్తుతం మేడిగడ్డ నిండుకుండను తలపిస్తోంది. త్వరలో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరిస్తాం అని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల రూపాయల లాభం వస్తుందని సీఎం రేవంత్ చెప్పారని, ఇప్పుడు నాలుగు నెలలపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఆయనకు అందులో వాటా ఎంత వస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ తో జరిగిన భేటీలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Also Read : Minister Tummala : పెద్ద వాగు వల్ల నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటాం