KTR: అందాల పోటీలతో పాటు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టిపెట్టాలి – కేటీఆర్
అందాల పోటీలతో పాటు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టిపెట్టాలి - కేటీఆర్
రేవంత్ ప్రభుత్వం అందాల పోటీలతో పాటు అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అగ్ని ప్రమాదాల్లో మరో ప్రాణం పోకుండా ప్రభుత్వం చూడాలన్నారు. చార్మినార్ పరిధి గుల్జార్‌హౌజ్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని ఆయన పరిశీలించారు. తాను రాజకీయంగా మాట్లాడటానికి ఇక్కడికి రాలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలని పేర్కొన్నారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 17 మంది మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు… ప్రాణాలపై దృష్టిపెట్టాలి. మృతుల కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ముఖ్యమంత్రే హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారు. వేసవి కాలం వచ్చే ముందు అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి. కానీ నీళ్లు లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవని తెలిసింది. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరం. హైదరాబాద్‌లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం. నిన్నటిరోజు దుర్భరమైన రోజు.. బాధితులు, మృతుల కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం’’ అని కేటీఆర్ తెలిపారు.