KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ ఆశక్తికర వ్యాఖ్యలు
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అంత ఈజీగా తీసుకోవద్దని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పార్టీ శ్రేణులకు సూచించారు. ‘‘మాగంటి గోపీనాథ్ అకాల మరణం చాలా బాధాకరం. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్, మాస్ అందరూ ఉంటారు. హైదరాబాద్ లో లక్ష మంది పేదలకు జీవో 58, 59 కింద పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.
అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. పేద వారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా? సన్న బియ్యంతో విద్యార్థులకు అన్నం పెట్టింది… కేసీఆర్ ప్రభుత్వమే. తెలంగాణలో మతం పేరుతో కేసీఆర్ రాజకీయం చేయలేదు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారు’’ అని కేటీఆర్ విమర్శించారు.
KTR – ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) భేటీ అయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం నివేదిక, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గత గురువారం కూడా బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్.. ఎర్రవల్లి నివాసంలో ఆ పార్టీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.
మరో వైపు, ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్‌ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది.
టీఆర్‌ఎస్‌గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్‌ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
Also Read : Minister Uttam Kumar Reddy: బనకచర్లపై ఎంతవరకైనా పోరాడతాం – మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
