KTR: కేసీఆర్ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఫైర్
కేసీఆర్ కు కాళేశ్వరం కమీషన్ నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ ఫైర్
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నోటీసులు ఇస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై నమ్మకం ఉందన్నారు. గత 17 నెలలుగా పాలన చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు. కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదని… పాలన కనిపించడం లేదన్నారు.
KTR Slams
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే కమిషన్ లు లేనిదే పనులు జరుగడంలేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోందని ప్రజల పాలన కాదని మాజీ మంత్రి అన్నారు. డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిందని… 8 మంది ప్రాణాలు కోల్పోయారని… కానీ అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయిందని విమర్శించారు. కమిషన్‌ల ఆరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి కూడా సాహసం చేయలేకపోయారన్నారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్ప లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలిందని… ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని.. ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి పెట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయని.. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది అని దుయ్యబట్టారు. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయన్నారు. కాంగ్రెస్‌వి అన్నీ చిల్లర ప్రయత్నాలు మాత్రమే అని… ప్రజలు ఆ పార్టీని తిరస్కరిస్తారన్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని.. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
KTR – కమిషన్ నోటీసులకు భయపడేది లేదు – ఈటల
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై ఈటల రాజేందర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ(BJP) ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఇంకా నోటీసులు అందలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు సహకరిస్తాను. చట్టాలు, కోర్టులు, కమిషన్‌పై నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారు. విచారణకు భయపడేది లేదు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను ఆర్థిక శాఖమంత్రిగా పని చేసిన సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్‌గా ఉన్నారని చెప్పారు. పీసీ కమిషన్‌ను ఎందుకు ఇన్నిసార్లు పొడిగించారో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. తుమ్మల, కడియం, జూపల్లికి ఏం జరిగిందో తెలియదా? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా… కాళేశ్వరంపై జూన్ ఐదో తేదీన విచారణకు రావాలని కేసీఆర్‌కు, జూన్ ఆరో తేదీన హరీష్ రావు, జూన్ తొమ్మిదో తేదీన ఈటల రాజేందర్‌ను విచారణకు రావాలని పీసీ కమిషన్ జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేసింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన వెంటనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : Orphan Girl: అనాథ యువతి పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష