KTR Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ పై .. కేంద్రానికి కేటీఆర్ లేఖ

KTR Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant) ప్రైవేటీకరణపై చాలా కాలంగా ఏపీలో ఉద్యమం నడుస్తోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీలో పలు పార్టీలు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు.

ఐతే ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విశాఖ స్టీల్ ప్లాంట్‌పై స్పందించడం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని.. ఏపీ బీఆర్ఎస్ (AP BRS) అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ రావుకు ఆయన సూచించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలను వెంటనే ఆపాలి. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను మానుకోవాలి. గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చింది. వర్కింగ్ క్యాపిటల్, నిధుల సమీకరణ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారు.

కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ చేశారు. అదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు లేదు. కేంద్ర ప్రభుత్వమే వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థికసాయం చేయాలి. విశాఖ ప్లాంట్ నుంచి స్టీల్ ఉత్పత్తులను కేంద్రమే కొనాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ విలీనాన్ని పరిశీలించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించాలి. ” అని లేఖలో పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు…దీనిని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి PSU కార్మికులు కలిసి రావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తమతో కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామని అన్నారు.

కాగా .. ఏపీ నుంచి ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ని నియమించారు. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ .. కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : పేపర్ లీక్ పై స్పందించిన మంత్రి హరీశ్ రావు

Leave A Reply

Your Email Id will not be published!