Kumki Elephants: ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
Kumki Elephants : ఏపీకి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్‌కు సిద్ధరామయ్య అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను(Kumki Elephants) రంగంలోకి దించుతారు.
‘రాష్ట్రంలో మదపుటేనుగులు, వాటి గుంపు సమస్య ఎప్పటి నుంచో ఉంది. మనుషులు – ఏనుగుల మధ్య ఉన్న ఈ సున్నితమైన సమస్య కారణంగా వందలాది ఎకరాల్లో పంటలు నాశనమవుతుంది. పదుల సంఖ్యలో మానవ ప్రాణాలు పోయాయి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి అందించిన కుంకీ ఏనుగుల వల్ల చాలా వరకు అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో సమస్య సమసిపోతుందని భావిస్తున్నాన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం 4 ఏనుగులను అందించిందని, మరో రెండు, మూడు వారాల్లో మిగిలిన ఏనుగులు వస్తాయని చెప్పారు. కుంకీ ఏనుగులను కుప్పంలోని ప్రత్యేక శిక్షణ కేంద్రానికి తరలించి తగిన శిక్షణ అందిజేస్తామని, అవసరం అయిన సమయంలో వాటి సాయం తీసుకుంటామన్నారు.
బుధవారం రాత్రి విజయవాడ విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గారు జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ ఏనుగుల సమస్యను చెప్పినప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్ గారు, అటవీశాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు సమస్య పరిష్కారం కోసం కుంకీ ఏనుగులు(Kumki Elephants) ఇచ్చేందుకు చొరవ చూపారు. కర్ణాటక అడవుల్లోనూ 3,600 ఏనుగులున్నట్లు చెప్పారు. కుంకీ ఏనుగులతో అక్కడి వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. అయినప్పటికీ మన సమస్యను అర్ధం చేసుకొని కుంకీ ఏనుగులను ఇవ్వడం అభినందనీయం.
Kumki Elephants – కుంకీ ఏనుగులు ఏం చేస్తాయ్ ?
కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాడడంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
Also Read : YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా షర్మిల నిరహార దీక్ష