Ladakh: హింసాత్మకంగా మారిన లద్దాఖ్‌ రాష్ట్ర హోదా ఆందోళనలు

హింసాత్మకంగా మారిన లద్దాఖ్‌ రాష్ట్ర హోదా ఆందోళనలు

Ladakh : కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌ కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ 15 రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారు. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లెహ్ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. పోలీసులతో ఘర్షణకు దిగడం, రాళ్లురువ్వడం, సీఆర్‌పీఎఫ్ వాహనంతో పాటు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడం వంటి హింసాత్మక చర్యలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో ఉద్యమం హింసాత్మక రూపు దాల్చడంతో తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు సోనం వాంగ్‌చుగ్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

Ladakh Statehood Raw

‘లద్దాఖ్ (Ladakh) యువకులు తక్షణం హింసను నిలిపివేయాలి. ఇందువల్ల మన ఉద్దేశం దెబ్బతినడంతో పాటు పరిస్థితి దిగజారిపోతుంది. లద్దాఖ్‌లో కానీ దేశంలో కానీ అస్థిరతను మనం కోరుకోవడం లేదు’ అని దీక్షా శిబిరం వద్ద గుమిగూడిన తన మద్దతుదారులను ఉద్దేశించి వాంగ్‌చుక్ పేర్కొన్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని, తద్వారా భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. లద్దాఖ్ (Ladakh) రాజకీయ భవిష్యత్తుపై చాలకాలంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో తిరిగి ఈ ఆందోళనకారుల్లో కదలిక వచ్చినట్టు చెబుతున్నారు. 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి బుధవారంనాడు క్షీణించింది. ఈ నేపథ్యంలో యువత రోడ్డుపైకి రావడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

ఈ హింసను కాంగ్రెస్ ప్రేరేపించింది – బీజేపీ

లద్దాఖ్‌కు (Ladakh) రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ లేహ్‌ నగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పోలీసులు జరిపిన కాల్పుల్లోనే నలుగురు యువకులు మృతిచెందారని, గాయపడిన వారి సంఖ్య ఎక్కువ ఉందని ఆందోళనకారులు ఆరోపించారు. లద్దాఖ్‌ లో హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడంపై కాంగ్రెస్‌ను బీజేపీ తప్పుపట్టింది. హింసను కాంగ్రెస్ రెచ్చగొట్టిందని అమిత్‌ మాలవీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆరోపించారు. అప్పర్ లెహ్ వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఆందోళనకారులను రెచ్చగొట్టినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. బీజేపీ కార్యాలయం, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ హింస జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.

లద్దాఖ్‌కు (Ladakh) రాష్ట్ర హోదాతోపాటు ఆరో షెడ్యూల్‌ పొడిగింపు డిమాండ్‌ చేస్తూ స్థానికంగా కొంతకాలంగా స్థానికంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 10 నుంచి ఓ పదిహేను మంది ఆమరణ దీక్షకు దిగారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో సెప్టెంబర్‌ 23 సాయంత్రం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌ అపెక్స్‌ బాడీ యువజన విభాగం తాజా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే లేహ్‌ నగరంలో అనేక మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వీరిని చెదరగొట్టేందుకు వచ్చిన భద్రతా దళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. స్థానిక భాజపా కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు ఫైరింగ్‌ చేశారు. అనంతరం లేహ్‌ జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు.

లద్దాఖ్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని విద్యార్థుల భారీ ఆందోళన

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్‌ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు లేహ్‌ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.

Also Read : Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడికి సహకరించిన వ్యక్తి అరెస్టు

Leave A Reply

Your Email Id will not be published!