Lalu Prasad Yadav: కొడుకు తేజ్‌ప్రతాప్‌ ను పార్టీ నుంచి, కుటుంబం నుండి బహిష్కరించిన లాలూ

కొడుకు తేజ్‌ప్రతాప్‌ ను పార్టీ నుంచి, కుటుంబం నుండి బహిష్కరించిన లాలూ

Lalu Prasad Yadav : రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌(Lalu Prasad Yadav) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతన్ని ఆరేళ్ల పార్టీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. నేటి నుంచి పార్టీకి, కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను’ అని లాలూ యాదవ్ హిందీలో రాసిన పోస్ట్‌లో తెలిపారు. శనివారం తాను రిలేషన్‌షిప్‌ లో ఉన్నానంటూ తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌ లో పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో లాలూ ప్రసాద్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Lalu Prasad Yadav – అసలు ఏం జరిగిందంటే ?

శనివారం తేజ్‌ ప్రతాప్‌(Tej Pratap Yadav) ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో తేజ్‌ ప్రతాప్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నారు. ఆ యువతి పేరు అనుష్క యాదవ్‌ అని, తాము గత 12ఏళ్లుగా రిలేషన్‌ లో ఉన్నట్లు ప్రకటించారు. అనుష్కవిడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ లో ఉండటం వలన పెళ్లి చేసుకోకుండా… రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఆయన పోస్టులో పేర్కొన్నార. అయితే ఆ పోస్టుపై దుమారం చెలరేగడంతో కొద్ది సేపటికే దానిని డిలీట్‌ చేశారు. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గతంలో కూడా తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, అనుష్క యాదవ్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రకటనపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు.

నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది – తేజ్‌ ప్రతాప్‌

అనంతరం దీనిపై తేజ్‌ ప్రతాప్‌ ‘ఎక్స్‌’ వేదికగా వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియాను ఎవరో హ్యాక్‌ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు పెట్టారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్‌ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. కాగా, తేజ్‌ ప్రతాప్‌ 2018లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Also Read : Bomb Threat: తాజ్‌ మహల్‌ కు బాంబు బెదిరింపు

Leave A Reply

Your Email Id will not be published!