Uttarakhand: ఉత్తరాఖండ్‌ లో విరిగిపడిన కొండ చరియలు

ఉత్తరాఖండ్‌ లో విరిగిపడిన కొండ చరియలు

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో వందలాది యాత్రికులు, స్థానికులు చిక్కుకుపోయారు. పితోరాగఢ్‌ జిల్లా సమీపంలో కైలాస్‌- మానసరోవర్‌ యాత్ర మార్గంలో అవి విరిగిపడటంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. ఆ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా స్థానిక యంత్రాంగం సహాయకచర్యలు ప్రారంభించింది. శిథిలాలను తొలగించేందుకు బోర్డర్‌ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) బృందం అక్కడకు చేరుకుంది. తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడేవరకు యాత్రికులు అక్కడే ఉండాలని సూచించారు.

Uttarakhand Landslides

ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్‌- మానస సరోవర్‌ యాత్రను ఈ ఏడాది జూన్‌ నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెల అధికారికంగా ప్రకటించింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకూ కొనసాగనున్న ఈ యాత్ర ఉత్తరాఖండ్(Uttarakhand), సిక్కింలలో ప్రారంభం కానుందని విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది. ‘50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాఖండ్‌ లోని లిపులేఖ్‌ పాస్‌ నుంచి, 10 బృందాలు సిక్కిం నాథులా పాస్‌ నుంచి ఈ యాత్రకు తరలి వెళ్తాయి’ అని వెల్లడించింది. యాత్ర కోసం దరఖాస్తులను kmy.gov.inలో సమర్పించవచ్చని, కంప్యూటర్‌ జనరేటెడ్‌ విధానం ఆధారంగా యాత్రికులను ఎంపిక చేస్తామని పేర్కొంది.

కొవిడ్‌ కారణంగా కైలాస పర్వతం, మానస సరోవర్‌ సరస్సు యాత్ర 2020లో ఆగిపోయింది. ఆ తర్వాత గల్వాన్‌ ఘర్షణల కారణంగా భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో యాత్ర పునరుద్ధరణ చర్యలు ముందుకు సాగలేదు. గతేడాది రష్యాలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కైలాస్‌- మానస సరోవర్‌ యాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారు.

సాక్షాత్తూ పరమశివుడు నివాసముంటాడని విశ్వసించే చోటు కైలాస పర్వతం. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు స్నానమాచరించే ప్రాంతంగా విశ్వసించే మానస సరోవరం సరస్సూ అక్కడికి చేరువలోనే ఉంటుంది. టిబెట్‌లోని ఈ రెండు సుమనోహర పుణ్యక్షేత్రాలు హిందువులతో పాటు జైనులు, బౌద్ధులకూ అత్యంత పవిత్రమైనవి. ఏటా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కైలాస-మానస సరోవర యాత్రలో పాల్గొంటారు.

Also Read : Beating Retreat: భారత్‌-పాక్‌ సరిహాద్దుల్లో నేటి నుంచి ‘బీటింగ్‌ రీట్రీట్‌’ పునః ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!