M Venkaiah Naidu: ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశక్తికర వ్యాఖ్యలు
ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశక్తికర వ్యాఖ్యలు
M Venkaiah Naidu : అధికారంలోనికి రావడానికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రకటించే ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల అప్పులు వంటి అంశాలపై తనదైన శైలిలో వెంకయ్యనాయుడు(M Venkaiah Naidu) స్పందించారు.
‘‘ఉచిత కరెంటు అంటారు.. ఆ తర్వాత నో కరెంటు అంటారు. నేను ఒక రాజకీయ పార్టీ నో, ఏ వ్యక్తి నో అనడం లేదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలే తప్ప ఉచితాలు కావు. పార్టీలు పోటీలు పడి.. ప్రజలకు ఉచితాలను ప్రకటిస్తున్నాయి. రాజకీయ పార్టీలలో మార్పు వస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది’’ అని అన్నారు.
‘‘అన్నీ ఫ్రీ.. ఫ్రీ.. అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి తెలుగు రాష్ట్రాలను తెచ్చారు. అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకొస్తున్నారు. పరిధికి మించి అప్పులు చేస్తే… అప్పులు కూడా పుట్టని స్థితికి వస్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేసే విధానం రావాలి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) నేతలు పరిస్థితులు గమనించాలి. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టాలి. భావితరాల గురించి ఆలోచించాలి. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు. మన భవిష్యత్తుకు మనమే ఓటు వేస్తున్నామనే విషయాన్ని ప్రజలు గమనించాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.
రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా… రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు… పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు… రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను… ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అర్ధవంతమైన చర్చ జరగాలి… వ్యతిరేకించే వారు వ్యతిరేకించినా.. ప్రజలు అంటే దేశం ఒక నిర్ణయానికి రావాలి.. పార్లమెంటు ఉభయసభలకు, అసెంబ్లీల సభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి.
M Venkaiah Naidu – రాజధానిపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ, ఉత్తరాంధ్ర వాసులు ఎంతో మంచి వారని… రాజధాని వస్తే చెడిపోయేవారేమోనని వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖకు రాజధాని వస్తుందేమోనని తాను భయపడినట్లు వెల్లడించారు. విశాఖ రాజధాని వద్దంటూ విశాఖ వాసే ఒకరు తనతో చెప్పారని, ఎందుకని అడిగితే ప్రశాంతత కావాలని చెప్పారని వివరించారు. ఇక తెలుగు భాషపై మాట్లాడుతూ.. మాతృ భాషకు అందరూ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే ఇవ్వాలని అన్నారు. అప్పుడే ప్రభుత్వ విధివిధానాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ న్యాయమూర్తి శివశంకరరావు మాట్లాడుతూ… ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తే పెద్ద ఇబ్బంది లేదు. పదే పదే మధ్యలో ఎన్నికలు వస్తే… ఎన్నికల కోడ్ ద్వారా చాలా పనులు ఆగిపోతాయి. చాలామంది సెక్యులర్ భావాలంటూ సమాంతర ఎన్నికలు వద్దంటారు… ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమే.. సమాంతర ఎన్నికల వలన ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. అడపా దడపా ఎన్నికలు జరిగితే ఎన్నికల కోడ్ పేరిట ఇబ్బందులు వస్తాయి. సమాంతర ఎన్నికలను అందరూ స్వాగతించాలని అన్నారు.
Also Read : Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి వివాదంపై టీడీపీ అధ్యక్షులు షాకింగ్ కామెంట్స్