Maha Surya Vandanam: అరకులో 21 వేల మంది విద్యార్థులతో ‘మహా సూర్యవందనం’

అరకులో 21 వేల మంది విద్యార్థులతో ‘మహా సూర్యవందనం’

 

అరకు డిగ్రీ కళాశాల వేదికగా ప్రపంచ రికార్డు సాధించేలా సోమవారం ‘మహా సూర్యవందనం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 వేల మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. 13000 వేల మంది ఆడపిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అరకులోని గిరిజన సంక్షేమ వసతి గృహం మైదానంలో ఈ మహా సూర్యవందనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ ఛార్జి మంత్రి సంధ్యా రాణి ప్రారంభించగా… ఐటీడీఏ, గిరిజన విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఏలేసా రైనాడ్ వచ్చారు.

సూర్య నమస్కారాల కార్యక్రమంలో పాడేరు డివిజన్‌లోని 60 ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. గత ఐదు నెలల నుంచి విద్యార్థులు సూర్య నమస్కారాల కోసం శిక్షణ తీసుకున్నారు. 200 మంది వ్యాయామ ఉపాధ్యాయులు సూర్య నమస్కారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ… ‘‘గిరిజన ప్రాంతంలో జరిగిన గొప్ప కార్యక్రమం ఇది. 5 మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఈ మహా సూర్యవందనంలో పాల్గొన్నారు. గిరిజన బిడ్డలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు అనడానికి ఇదే నిదర్శనం’’ అని అన్నారు. ఆసనాలతో క్రమశిక్షణ, ఓపిక చదువుపై శ్రద్ధ పెరుగుతుందని అన్నారు. మహా సూర్య వందనం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న అల్లూరి జిల్లా యంత్రాంగానికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల నిత్య జీవితంలో ఇది నిరంతర అభ్యాసంగా నిలవాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!