Malika Garg: పల్నాడు పేరు చెడగొట్టారు – ఎస్పీ మలికా గార్గ్

పల్నాడు పేరు చెడగొట్టారు - ఎస్పీ మలికా గార్గ్

Malika Garg: 2024 సార్వత్రిక ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు వేదికగా మారిన పట్నాడు ప్రాంతంపై ఎస్పీ మలికా గార్డ్(Malika Garg) కీలక వ్యాఖ్యలు చేసారు. పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం జరగిన హింసాత్మక ఘటనలతో మాచర్ల, నరసరావు పేట పేర్లు భారతదేశం అంతా మార్మోగుతున్నాయని… పల్నాడు పేరు చెడగొట్టారు. ఇక్కడ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్లపైన తిరుగుతుంటారని దేశమంతటా ప్రచారమైందని ఆమె అన్నారు. శాంతిభద్రతలపై పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గురువారం స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నా బ్యాచ్‌మేట్స్, కుటుంబసభ్యులు, మిత్రులు పల్నాడులో అంత ఫ్యాక్షన్‌ ఉందా అని అడుగుతున్నారని ఆమె తెలిపారు.

Malika Garg Comment

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో పల్నాడు అత్యంత దారుణం (వరెస్ట్‌)గా ఉందని… పది రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదవడం తాము కోరుకోని రికార్డు అని చెప్పారు. రెండో స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయంటే పల్నాడులో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఆయా కేసుల్లో 1300 మందిని అరెస్టు చేశామని, వారిలో 400 మందిపై రౌడీషీట్లు తెరిచామని ఎస్పీ వెల్లడించారు. ఇక్కడ జైళ్లు పట్టక రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపిస్తున్నట్లు వివరించారు.

‘నాయకులు బాగానే ఉన్నారు… వారికి డబ్బు, తెలివి ఉన్నందున బెయిల్‌ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు… ఈ గొడవల్లో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారు’ అని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ జిల్లా ప్రజల్లో పౌరుషం ఎక్కువని, ఇక్కడివారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తనకు తెలుసన్నారు. ఎస్పీగా ఈ జిల్లాకు మంచిపేరు తెచ్చేందుకు మీ అందరి సహకారం కోరుతున్నానన్నారు. పట్టణ సీఐ సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో అదనపు ఎస్పీ రాజశేఖర్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Also Read : Tadipatri: తాడిపత్రి ఆర్వోను మార్చిన ఎన్నికల కమీషన్ !

Leave A Reply

Your Email Id will not be published!