Mallikarjun Kharge: కర్ణాటక సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం డీకేలకు మల్లికార్జున ఖర్గే క్లాస్
కర్ణాటక సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం డీకేలకు మల్లికార్జున ఖర్గే క్లాస్
Mallikarjun Kharge : కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మెయిలీ వ్యాఖ్యల అనంతరం కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge)తో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ కావడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేయాలంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సూచించారు.
Mallikarjun Kharge Settle
16వ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సిద్ధరామయ్యపై(CM Siddaramaiah) ఖర్గే ప్రశంసలు కురిపించారు. ‘‘ఇది మంచి బడ్జెట్. మంచి పనులు చేసే వ్యక్తులకు పార్టీ ఎప్పుడూ మద్దతిస్తుంది. వారిని ప్రోత్సహిస్తుంది. పార్టీ, రాష్ట్రం కోసం శివకుమార్ ఎంతో శ్రమిస్తారు. ప్రజల కోసం అకింత భావంతో పని చేయడాన్ని చూశాం. ఇద్దరు నేతలు కలిసికట్టుగా రాష్ట్రం కోసం పాటుపడాలి. ప్రజలను నిర్లక్ష్యం చేస్తే… వారు పార్టీపై నమ్మకం కోల్పోతారు’’ అని ఖర్గే పేర్కొన్నారు.
‘‘ఈ ఇద్దరు నేతలు కలిసి ఉంటేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. లేకపోతే పార్టీతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఏదేమైనా కలిసే ముందుకు సాగాలి’’ అని సూచించారు. కాగా.. రాష్ట్రంలో నాయకత్వం మార్పు జరుగుతుందంటూ రాజకీయా వర్గాలు జోరుగా ప్రచారం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలపై ఇటీవల స్పందించిన డీకే… తాను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదినంటూ వ్యాఖ్యానించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం కూడా లేదని స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ, ఈ ప్రచారానికి తెరపడలేదు. ఇటీవల ఖర్గేతో శివకుమార్ భేటీ కావడంతో ఆయనకు సీఎం పదవి ఖాయమంటూ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఖర్గే ఇద్దరు నేతలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : General Upendra Dwivedi: చైనా, పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు