Mallikarjun Kharge: రాజీనామా విషయంలో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి – మల్లికార్జున ఖర్గే
రాజీనామా విషయంలో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి - మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు గల కారణాలపై తన వద్ద ఎటువంటి సమాచారం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి పేర్కొన్నారు. ఆయన ఎప్పుడూ ప్రభుత్వ పక్షమే ఉండేవారని, అనేక సమస్యలను లేవనెత్తినప్పుడల్లా ప్రతిపక్షాలను అనుమతించలేదన్నారు. కర్ణాటకలోని విజయపురలో విలేకరులతో మాట్లాడుతూ… ఆయనకు, ప్రధాని మోదీకి మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ధన్‌ఖడ్ చెప్పాలని అన్నారు.
Mallikarjun Kharge Key Comments
రైతులకు మద్దతుగా ధన్‌ఖడ్ మాట్లాడినందుకే తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందా? అని అడిగిన ప్రశ్నకు మల్లికార్జున ఖర్గే బదులిస్తూ… ‘‘రాజ్యసభలో రైతులు, పేదలు, అంతర్జాతీయ విషయాలు లేదా విదేశాంగ విధానం తదితర అంశాలను మేం లేవనెత్తినప్పుడు మాట్లాడేందుకు మాకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. ఉప రాష్ట్రపతి రాజీనామాకు సంబంధించి విషయాలేవీ నాకు తెలియవు. ధన్‌ఖడ్ ఎప్పుడూ ప్రభుత్వ పక్షమే. అది ఆయనకు-మోదీకి మధ్య వ్యవహారం. దానిపై మాకు ఎటువంటి సమాచారం లేదు. ఏం జరిగిందో ఆయనే చెప్పాలి’’ అని అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిని మారుస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుతానని.. ఇప్పుడు చెప్పలేనన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, రెండు కీలక పదవులు ఆయన చేతిలోనే ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఆయన స్థానంలో కొత్తవారిని నియమించనున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఉప రాష్ట్రపతి పదవికి జులై 21న సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు పేర్కొన్నప్పటికీ విపక్ష పార్టీలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : Ladki Bahin Yojana: మహిళల ‘లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారుల్లో 14 వేల మంది పురుషులు
