కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటు వేసిన వారికి వేయని వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇది సమిష్టి విజయమన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పని చేశారని వారిని మరిచి పోలేమన్నారు.
ఇక్కడ కులం, మతం, ద్వేషం ఏ మాత్రం పని చేయలేదన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని తాము ముందు నుంచి చెబుతూ వచ్చామని కానీ బీజేపీ నమ్మలేదన్నారు. అబద్దాల ప్రచారంపై పరుగులు తీయాలని అనుకున్న భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాకి, జేపీ నడ్డాకి కోలుకోలేని రీతిలో కన్నడ వాసులు షాక్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం విద్వేష రాజకీయాలు పని చేయవని గుర్తిస్తే మంచిదన్నారు మల్లికార్జున్ ఖర్గే.
మోదీ, షా, జేపీ నడ్డా పోటా పోటీగా ప్రచారం చేశారని, వేల కోట్లు కుమ్మరించారని, ఆచరణకు నోచుకోని హామీలతో ప్రజలను బోల్తా కొట్టించాలని చూశారని కానీ జనం నమ్మలేదన్నారు. ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని బీజేపీని ఖతం చేశారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎన్నికల యుద్దంలో తాము గెలిచామని రేపటి యుద్దంలో సైతం విజయం సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు.