Mani Shankar Aiyar: రాజీవ్‌ గాంధీపై కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు

రాజీవ్‌ గాంధీపై కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ సంచలన వ్యాఖ్యలు

Mani Shankar Aiyar : దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై కాంగ్రెస్‌ సీనియర్ నేత మణి శంకర్ అయ్యార్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీని ఉద్దేశిస్తూ… ఆయన రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారని… అలాంటి వ్యక్తి దేశ ప్రధాని ఎలా అయ్యారోనంటూ వ్యాఖ్యానించారు. ప్రముఖ మీడియా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిశంకర్(Mani Shankar Aiyar) మాట్లాడుతూ… ‘‘నేను, రాజీవ్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నాం. నాడు ఆయన పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారు. విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉత్తీర్ణులు చేయాలనే ప్రయత్నిస్తుంది. కానీ, రాజీవ్ మాత్రం విఫలమయ్యారు. ఆ తర్వాత లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజీలో కూడా ఫెయిల్‌ అయ్యారు. చదువు విషయంలో ఆయన చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. రెండు సార్లు విఫలమై, పైలట్‌గా పని చేసిన వ్యక్తి దేశ ప్రధాని అవుతారని నేను ఊహించలేదు. ఇది ఎలా సాధ్యమైందో’’ అన్నారు. దీనితో మణిశంకర్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీను ఇరుకున పెట్టాయి.

Mani Shankar Aiyar Shocking Comments

ఈ వీడియోను బీజేపీ నేత అమిత్‌ మాలవీయా తన ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు. ‘ఆయనను ముసుగు తొలగించనివ్వండి’ అంటూ విమర్శించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మణి శంకర్‌ గతంలోనూ సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు, పతనానికి ‘గాంధీ కుటుంబమే’ కారణమన్నారు. పదేళ్లలో పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో ఒక్కసారి కూడా సమావేశం అయ్యేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలతో కూడా ఒకటి, రెండు సార్లు మాత్రమే భేటీ అయినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ లో చిన్న నేతలకు సరైన గుర్తింపు ఉండదన్నారు. నాడు ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం మరోసారి ఆయన వివాదస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టినట్లయింది.

Also Read : Prashant Kishor: నీతీశ్‌ కుమార్‌ కూటమి మారడం ఖాయం- ప్రశాంత్ కిషోర్

Leave A Reply

Your Email Id will not be published!