May Day: విమాన ప్రమాదం గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్, ‘మే డే కాల్’ ?

విమాన ప్రమాదం గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్, 'మే డే కాల్' ?

May Day : అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందినట్లు తెలిసిందే. వీరిలో 229 మంది ప్రయాణీకులు, 10 మంది సిబ్బందితో పాటు విమానం కుప్పకూలిన ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో లంచ్ చేస్తున్న 24 మంది కూడా మృతి చెందారు. ఈ మొత్తం విమాన ప్రమాదం నుండి బ్రిటీష్ పౌరసత్వం ఉన్న భారతీయ యువకుడు మాత్రమే బ్రతికి బట్టకట్టాడు. ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు భారత ప్రభుత్వం, ఎయిర్ ఇండియా, డీజీసీఏ సహా నిపుణులు నిమగ్నయ్యారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాద ఘటనలో బ్లాక్‌ బాక్స్‌ ఏం చెబుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విమాన ప్రమాదాలు జరిగే సమయంలో ఆ ప్రమాదానికి గ కారణాలు విప్పే బ్లాక్‌ బాక్స్‌… అహ్మదాబాద్‌(Ahmedabad) విమాన ప్రమాదం తర్వాత పదిలంగానే ఉండటంతో దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే విమానం ప్రమాదానికి గురి కావడానికి కొన్ని నిమిషాల ముందు ‘మేడే మేడే(May Day) అంటూ ఏటీసీకి వాయిస్‌ సంకేతాలు వెళ్లాయి. విమానం ప్రమాదానికి గురౌతుందన్నప్పుడు, ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నప్పుడు మేడే మేడే అని సిగ్నల్స్‌ ఇస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగడానికి ఎంత సేపో పట్టలేదు. విమానం పూర్తిగా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోవడంతో కుప్పకూలిపోయింది.

May Day – ‘మే డే కాల్’ అంటే ఏంటి?

విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే (May Day) ’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్‌ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్‌ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్‌ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఏదైనా విమాన ప్రమాదం బారిన పడే అవకాశం ఉన్నప్పుడు ఇలా పైలట్‌ దగ్గరలోని ఏటీసీకి ఈ ‘మేడే కాల్ (May Day)’ ద్వారా సిగ్నల్‌ ఇస్తారు. ప్రధానంగా విమాన ప్రయాణీకుల ప్రాణాలు ఇబ్బందుల్లో పడినప్పుడు లేదా అత్యవసరంగా ఇంజిన్ పనిచేయకపోయినప్పుడు, మంటల్లో చిక్కుకున్న సమయంలో కానీ, గాలిలో ఏదైనా పక్షిలాంటితది ఢీకొన్న సమయంలో, హైజాక్‌ సమయంలో ఈ మేడే కాల్‌ ను ఏటీసీకి అందిస్తారు. మేడే సంకేతం ఇచ్చిన వెంటనే ఏటీసీ స్పందిస్తుంది అత్యవసరం వచ్చిందని పరిగణిస్తూ రన్ వేను క్లియర్ చేసి.. అంబులెన్స్, అగ్నిమాపకదళాలని వెంటనే సిద్ధం చేస్తారు.

మేడే పదానికి అర్థమేంటి? ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?

సివిల్‌ ఏవియేషన్‌ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌ (London) లోని క్రోయ్‌డన్‌ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌ గా పనిచేసిన ఫ్రెడరిక్‌ స్టాన్లీ మాక్‌ఫీల్డ్‌ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్‌ పదమైన మైడెర్‌ కు సమానార్ధకం. ఫ్రెంచ్‌లో మైడెర్‌ అంటే సహాయం చేయండి (హెల్ప్‌ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్‌ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్‌ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్‌ ఏవియేషన్‌ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్‌ఓఎస్‌ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.

మేడే కాల్‌ వస్తే ఏం జరుగుతుంది ?

ఎవరైనా పైలట్‌ నుంచి ఏటీసీకి మేడే కాల్‌ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్‌ ఇచ్చిన పైలట్‌ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు.

Also Read : Air India: విమానంలో లోపం ఉందని ముందే చెప్పిన ప్రయాణీకుడు ! పట్టించుకోని ఎయిర్ ఇండియా ?

Leave A Reply

Your Email Id will not be published!