Bihar: బిహార్‌ ఓటర్ల జాబితాలో భారీగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు

బిహార్‌ ఓటర్ల జాబితాలో భారీగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు

Bihar : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా బీహార్‌లో (Bihar) ఓటర్ల జాబితాపై ఇంటెన్సివ్ సమీక్ష కోసం ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన సర్వేలో నేపాల్ (Nepal), బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్‌ కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలిందని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్‌లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ పంచాయతీలలో ఇంటింటికీ వెళ్లి బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ)చేస్తున్న పనిని ధృవీకరిస్తున్నారు. బూత్-స్థాయి అధికారుల ఇంటింటి సందర్శనల సమయంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌లకు చెందిన ఓటర్లను కనుగొన్నారని ఈసీఐ అధికారులు తెలిపారు.

Bihar Voter List

ఎన్నికల అధికారుల సమాచారం ప్రకారం… ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బంగ్లా, నేపాల్‌, మయన్మార్‌ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసముంటున్నారని తేలింది. వీరంతా ఆధార్‌ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌ కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది. సర్వే కోసం వెళ్లే క్షేత్ర స్థాయి అధికారులు ఇలాంటి వారిని అనేక మందిని గుర్తించినట్లు సమాచారం. వీటన్నింటినీ ఆగస్టు 1 నుంచి పరిశీలిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా సవరణ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా పరిణామం ఆందోళన రేకెత్తిస్తోంది.

అనర్హులు, నకిలీ ఓటర్లతోపాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించేడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. కాగా… అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలు ముందు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం చెప్పినట్లు ఈసీ ఈ వ్యూహాన్ని అమలుచేస్తోందని కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా బ్లాక్‌ ఆరోపిస్తోంది. ఈ విషయంపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా… ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని పేర్కొంది. అయితే, ఈసీ ఎంచుకున్న సమయాన్ని మాత్రం ప్రశ్నించింది.

ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. దేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్, మయన్మార్‌లకు చెందిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో వీరు ఓటర్లుగా మారడంపై చర్చ మొదలయ్యింది. కాగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి.

Also Read : Rajya Sabha: నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Leave A Reply

Your Email Id will not be published!