Mayawati: మేనల్లుడు ఆకాశ్‌ కు షాక్ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి !

మేనల్లుడు ఆకాశ్‌ కు షాక్ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి !

Mayawati : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ కు గట్టి షాక్ ఇచ్చారు. మాయావతి(Mayawati) వారసుడిగా చెప్పుకునే ఆకాశ్ ను పార్టీకి సంబంధించిన అన్ని కీలక పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఆమె తాజాగా ప్రకటించారు. బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆకాశ్‌ తండ్రి ఆనంద్‌ కుమార్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు రామ్‌జీ గౌతమ్‌ ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తాను బతికున్నంత కాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని సంచలన ప్రకటన చేశారు. గతేడాది కూడా ఆకాశ్‌(Akash) ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి, ఆ తర్వాత తన రాజకీయ వారసుడిగా మాయావతి(Mayawati) ప్రకటించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే బతికుండగా వారసుడి ఊసెత్తనని నొక్కి చెప్పారు. లఖ్‌నవూలో ఆదివారం జరిగిన బీఎస్పీ ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

Mayawati Shock to Akash

ఈ సందర్భంగా మార్చి 15న నిర్వహించనున్న పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌ జయంతి వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి… ఆయన సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందన్నారు. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని అన్నారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తానని స్పష్టం చేశారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి, బలహీనపరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్‌ మామ అశోక్‌ సిద్దార్థ్‌ ను ఈ నియమానికి అనుగుణంగానే గత నెల పార్టీ నుంచి బహిష్కరించామని… ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్‌ ను సైతం పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వివరించారు. ఆకాశ్‌ రాజకీయ జీవితంపై ఇప్పటికీ అతడి మామ సిద్దార్థ్‌ ప్రభావం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన సోదరుడు ఆనంద్‌ కుమార్‌ మాత్రం పార్టీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము కానీయలేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఒకే నాణేనికి రెండు వైపుల వంటివని ఈ సందర్భంగా మాయావతి విమర్శించారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాష్‌ ఆనంద్ రాజకీయ అరంగేట్రం చేశారు. సోషల్ మీడియా ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2023 చివర్లో పార్టీ జాతీయ సమన్వయకర్తతో నియమితులయ్యారు. అయితే, లోక్‌ సభ ఎన్నికలకు ముందు మాయావతి అతనిని పార్టీలోని పదవుల నుంచి తొలగించింది. రాజకీయాల్లో ఆకాష్‌ మరింత పరిణితి పొందాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ సున్నా స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత జూన్ 2024లో ఆకాష్‌ ఆనంద్‌ ను తిరిగి పార్టీకి తీసుకున్నారు. పలు పార్టీ పదవుల్ని కట్టబెట్టారు. మళ్లీ ఏమైందో ఏమో ఆ మేనల్లుడిని అన్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది.

Also Read : Ganga River Pollution: కాలుష్య కోరల్లో గంగా నది ! స్నానానికి కూడా పనికిరాని నీరు!

Leave A Reply

Your Email Id will not be published!