Mehul Choksi: బెల్జియంలో మెహుల్ ఛోక్సీ అరెస్టు ! త్వరలో భారత్ కు అప్పగింత !
బెల్జియంలో మెహుల్ ఛోక్సీ అరెస్టు ! త్వరలో భారత్ కు అప్పగింత !
Mehul Choksi : పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి… వేలకోట్లు కుంభకోణం చేసిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత శనివారమే ఛోక్సీని అరెస్టు చేయగా… ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు ఛోక్సీ(Mehul Choksi) అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. ఇటీవలే 26/11 దాడుల కుట్రదారు తహవ్వుర్ రాణాను భారత్ అమెరికా నుంచి రప్పించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ ఛోక్సీ అరెస్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Mehul Choksi to Be Sent to India
వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ(Mehul Choksi) పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank) ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ (కేసులో మరో ప్రధాన నిందితుడు) దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా… నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. వీరిని భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ… మెహుల్ ఛోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. ఛోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ… ఆయన్ను అప్పగించే విషయంలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈక్రమంలోనే ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని గతనెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశ జాతీయురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ పొందినట్లు సమాచారం. ఈ కార్డు ద్వారా కొన్ని షరతుల కింద జీవిత భాగస్వామితో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు. దీనికోసం ఆయన తప్పుడు పత్రాలు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక, ఛోక్సీ ఇప్పటికీ భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఇదిలాఉండగా… ఈ కేసులో మరో నిందితుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు.
స్విట్జర్లాండ్ పరారీకి మెహుల్ ఛోక్సీ ప్లాన్
వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ కదలికలపై భారత ఏజెన్సీలు కొన్ని నెలలుగా నిఘా పెట్టాయి. అతడికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాల ఏజెన్సీలతో పంచుకొన్నాయి. ఎట్టకేలకు ఈ ఆర్థిక నేరగాడిని బెల్జియం పోలీసులు అరెస్టు చేసేటట్లు చేశాయి. సీబీఐ(CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లు గతేడాది ఛోక్సీ కదలికలను బెల్జియంలో గుర్తించాయి. దీనితో అక్కడి ఏజెన్సీలను అలర్ట్ చేశాయి. అతడి నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు, సమాచారాన్ని బెల్జియం దర్యాప్తు బృందాలతో పంచుకొన్నాయి. ఈ సమయంలోనే అతడు స్విట్జర్లాండ్ కు పారిపోయేందుకు ప్లాన్ వేస్తున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు ఏప్రిల్ 12న అరెస్టు చేశారు.
మెహుల్ ఛోక్సీ మోసాన్ని తొలిసారి బయటపెట్టిన ప్రజావేగు హరిప్రసాద్ ఎస్‌వీ తాజాగా స్పందించారు. ‘‘ఛోక్సీ అరెస్టు చాలా గొప్ప విషయం. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు.. అతడి చేతిలో మోసపోయిన వారందరికీ గొప్ప వార్త. వీలైనంత త్వరగా ప్రభుత్వం అతడిని భారత్‌కు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. అదే సమయంలో అతడు మోసం చేసిన బిలియన్ల డాలర్ల సొమ్మను కూడా ప్రపంచంలో ఏ మూల ఉన్నా… దేశానికి తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ విషయంలో భారత ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
Also Read : Akash Anand: బిఎస్పీ అధినేత్రి మాయావతికి మేనల్లుడు ఆకాశ్ బహిరంగ క్షమాపణ