Mig 21: చరిత్ర పుటల్లోకి మిగ్-21 – రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
చరిత్ర పుటల్లోకి మిగ్-21 - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Mig 21 : ఆరు దశాబ్దాలకుపైగా భారత గగనతలాన్ని శాసించిన దిగ్గజ యుద్ధవిమానం మిగ్-21 చరిత్రపుటల్లో కలిసిపోయింది. వైమానిక దళానికి అలుపెరగని సేవలు అందించిన ఈ లోహవిహంగం శాశ్వత విశ్రాంతి తీసుకోనుంది. శుక్రవారం జరిగిన వేడుకలో ఈ ఫైటర్ జెట్‌లను లాంఛనంగా వాయుసేన నుంచి ఉపసంహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ యుద్ధవిమానం భారత్ కు గర్వకారణమని పేర్కొన్నారు. దేశానికి దీనితో బలమైన అనుబంధం ఉందన్నారు.
Mig 21 Updates
రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్-21 (Mig 21)… భారత తొలి సూపర్‌సోనిక్ యుద్ధవిమానం. కాలం చెల్లడంతో వాటికి వీడ్కోలు పలకాలని వైమానిక దళం నిర్ణయించింది. వాటి స్థానాన్ని… దేశీయ తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేస్తోంది. 1963లో తొలి మిగ్-21 స్క్వాడ్రన్ ఏర్పాటైన చండీగఢ్‌లోనే తాజాగా వీటికి వీడ్కోలు పలకడం విశేషం. ఈ కార్యక్రమంలో అద్భుత వైమానిక విన్యాసాలు జరిగాయి. తొలుత వాయుసేనకు చెందిన ‘ఆకాశ్ గంగ’ బృందం 8వేల అడుగుల ఎత్తు నుంచి అబ్బురపరిచేలా స్కై డైవింగ్ చేసింది. అనంతరం సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం విన్యాసాలు వీక్షకులను ఊపిరిబిగబట్టేలా చేశాయి. చివరిగా 23వ స్క్వాడ్రన్‌కు చెందిన ఆరు మిగ్-21 యుద్ధవిమానాలు గగనవిహారం చేశాయి. ‘బాదల్ 3’ సంకేతనామంతో వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి.సింగ్ స్వయంగా ఒక యుద్ధవిమానాన్ని నడిపారు. మహిళా పైలట్ ప్రియా శర్మ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. దీంతో మిగ్-21ను చివరిసారిగా నడిపిన మహిళా పైలట్‌గా ఆమె గుర్తింపు పొందారు. అనంతరం జల ఫిరంగులతో మిగ్-21లకు వందన సమర్పణ జరిగింది. లాంఛనంగా ఆరు జెట్‌లను ‘స్విచ్ఛాఫ్’ చేశారు.
Also Read : Minister Jaishankar: ఉగ్రవాదంపై సహనం చూపొద్దు ప్రపంచ దేశాలకు జైశంకర్ సూచన
