MIM Party: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎంఐఎం దూరం ?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు ఎంఐఎం దూరం ?

MIM Party : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలకు మజ్లిస్‌ పార్టీ దూరం పాటించనుందా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ‘ఎన్నికల్లో స్థానికుడు, సమర్థుడు, ప్రజా సమస్యల పరిష్కరానికి తపించే యువ నేతను ఎన్నుకోవాలి’ అని పిలుపునివ్వడం ఇందుకు బలం చేకూర్చుతోంది. ఏకంగా ఒవైసీ… బీఆర్‌ఎస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పదేళ్లు ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి పార్టీ అధికారంలో ఉన్నప్పటికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని… తాను బాధ్యతాయుతంగా చెబుతున్నానంటూ అనడమే కాకుండా సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి నియోజకవర్గ అభివృద్ధి పనులు తీసుకెళ్లినప్పుడు తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

దీంతో కాంగ్రెస్‌కు (Congress) మజ్లిస్‌ మద్దతు యోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించినట్లైంది. మరోవైపు బీజేపీ బలోపేతం కాకుండా నిలువరించాల్సి అవసరం ఉందని, మధ్యలో ఓట్లు చీల్చేందుకు కొన్ని కత్తెర పార్టీలు రావ్చని, ఆలోచించి యువనేతను ఎన్నుకోవాలని సూచించడాన్ని బట్టి ఉప ఎన్నికల్లో పోటీకి దూరం పాటిస్తున్నట్లు పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. పార్టీ పరంగా అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

MIM Party – అధికారపక్షంతో కలిసి నడిచేందుకు

మజ్లిస్‌ (MIM Party) పార్టీ వ్యూహంలో భాగంగా తాము ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ సెగ్మెంట్లలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి నడిచే అనవాయితీ ఉంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్‌ పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా తయారైన మజ్లిస్‌ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌పై పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

తెలంగాణ ఆవిర్భావ సమయంలో బరిలో దిగి ఢీ… అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్‌ఎస్‌ దోస్తీ కోసం బరిలోకి దిగలేదు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌తో సత్ససంబంధాలు కలిగి ఉండటంతో ఉప ఎన్నికలకు దూరం పాటించాలని భావిస్తోంది.

సెగ్మెంట్‌లో మజ్లిస్‌ ప్రస్థానం

తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్‌ (MIM Party) గట్టి పోటీ ఇచ్చింది. అప్పటో మజ్లిస్‌ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్‌ యాదవ్‌ తొమ్మిది వేల ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. దీనితో నవీన్‌ యాదవ్‌ మజ్లిస్‌కు (MIM Party) రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సుమారు 18 వేల పై చిలుకు ఓట్లు సాధించారు.

2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన మజ్లిస్‌ పార్టీ (MIM Party)… జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి మళ్లకుండా చేసి అధికార బీఆర్‌ఎస్‌కు సహకరించేందుకు ఆ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అంతా ఊహించినట్లే బీఆర్‌ఎస్‌కు (BRS) లాభం చేకూరింది. కానీ… రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం చేజారగా.. కాంగ్రెస్‌ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో మజ్లిస్‌ స్నేహం కుదిరింది. తాజాగా ఉప ఎన్నికల్లో దూరం పాటించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రూపొందించే ప్రణాళిక(మ్యానిఫెస్టో)లో నెరవేర్చగల, హేతుబద్ధమైన హామీలనే పొందుపర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. హామీలను నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను కూడా విస్తృతంగా సూచించాలని స్పష్టంచేసింది. ఓటర్లపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలను నివారించాలంది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలు, అభ్యర్థులు ప్రణాళికల విడుదల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను సంఘం నిర్దేశించింది.

రాజ్యాంగం నిర్దేశించిన రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల్లో భాగంగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై హామీలను ఇవ్వొచ్చు. వాగ్దానాల తర్కం, అమలు, విశ్వసనీయత, ఆర్థిక స్తోమతలను ప్రణాళిక ప్రతిబింబించాలి. రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధమైన, ప్రవర్తనా నియమావళిలోని ఇతర నిబంధనలకు వ్యతిరేకంగా ఉండే హామీలు ఉండొద్దు. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతకు భంగం కలిగించేలా, ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపేలా హామీలు చేయకూడదు. ఎన్నికల ఏ దశలో అయినా ప్రణాళికను విడుదల చేయొచ్చు. పోలింగ్‌ ముగియడానికి రెండు రోజుల ముందు మాత్రం నిషేధం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావాన్ని నివారించడానికి అధికార, రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్, కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలిక, జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజాపరిషత్, జాతీయ, రాష్ట్ర, జిల్లా సహకార సంస్థల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులను ఏజెంట్లుగా పెట్టొద్దని తెలిపింది.

Also Read : Indian Army Chief: పాక్‌ కు భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది స్ట్రాంగ్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!