Minister Anagani Satyaprasad: కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి అనగాని ఆశక్తికర వ్యాఖ్యలు

కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి అనగాని ఆశక్తికర వ్యాఖ్యలు

Anagani Satyaprasad : గత ప్రభుత్వం జిల్లాల విభజన ప్రక్రియను అస్తవ్యస్తంగా చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆరోపించారు. గత నాయకుల ఒత్తిళ్లతో… జిల్లాల విభజన విషయంలో అధికారులు ప్రజాభిప్రాయం మేరకు పనిచేయలేదని…ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికే GMOను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో చర్చ జరిగినట్లు మంత్రి సత్యప్రసాద్ (Anagani Satyaprasad) తెలిపారు. చర్చలో భాగంగానే జిల్లాల, మండలాల, గ్రామల సరిహద్దుల మార్పులపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

Minister Anagani Satyaprasad Key Comments on New Districts

‘‘గత ప్రభుత్వం తొందరపాటు చర్యలు, ఒత్తిళ్లతో జిల్లాల విభజన ప్రజలకు అనుకూలంగా చేయలేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం జీవోఎంను ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వినతులిచ్చారు. ఆయా అంశాలపై సమావేశంలో చర్చించాం. ఈనెల 29, 30 తేదీల్లో మంత్రులం రెండు గ్రూపులుగా విడిపోయి జిల్లాల్లో పర్యటిస్తాం. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రజా ప్రతినిధులు, ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తాం. సెప్టెంబర్ 2 నాటికి గ్రీవెన్స్ పూర్తి చేస్తాం. ఇవాళ్టి నుంచి ప్రజలు తమ వినతులను ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇవ్వవచ్చు.

అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) నివేదిక ఇస్తాం. మంత్రివర్గంలో చర్చించిన తర్వాత సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు. డిసెంబర్ చివరి నాటికి సరిహద్దుల మార్పుల ప్రక్రియ పూర్తి చేస్తాం. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ సరిహద్దులను మాత్రమే మేం మార్చగలం. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులను ప్రస్తుతం చేయడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుపైనా సమగ్రంగా చర్చిస్తాం. జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యమే మాకు ముఖ్యం. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తాం’’ అని మంత్రి వివరించారు.

Also Read : YS Jagan: పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి – వైఎస్ జగన్

Leave A Reply

Your Email Id will not be published!